బోడుప్పల్, ఫిబ్రవరి 11 : చెరువులు నీటి వనరులు మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యతకు కీలకమైన సహజ సంపద. అలాంటి వీటిని రక్షించాల్సిన పాలకులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో నాడు చెంగిచర్లకు కల్పతరువుగా ఉన్న చింతల చెరువు (Chinthala Cheruvu) నేడు తన అస్థిత్వం కోల్పోతుంది. బోడుప్పల్ సర్కిల్-10 పరిధిలోని సుమారు 34 ఎకరాల్లోని చింతల చెరువు మురుగుతో నిండి ప్రజలపాలిట మృత్యుకూపంగా మారింది.
శరవేగంగా అభివృద్ది చెందుతున్న బోడుప్పల్ ప్రాంతంలోని చింతల చెరువు ఒకప్పపుడు పరిశుభ్రంగా ఉండేది. కానీ, ప్రస్తుతం ప్రజల ఆరోగ్యానికి, జీవన నాణ్యతకు తీవ్ర ముప్పుగా మారింది. ఎగువన ఉన్న సుమారు 60 కాలనీల మురుగునీరు నేరుగా చెరువులోకి చేరడంతో క్రమంగా చెరువు తన అస్థిత్వాన్ని కోల్పోతోంది. చెరువు పైబాగంలో ఆకుప్పచ్చని పచ్చిక, గుర్రపుడెక్క, నల్లటి నీరు, దుర్వాసన వ్యాపించడంతో పరిసర ప్రాంతాల కాలనీవాసులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. నలుమాలలా రియల్ ఎస్టేట్ వెంచర్లు చుట్టుముట్టడంతో చెరువు పరిధి తగ్గుతోంది.
చింతల చెరువును పరిరక్షణను పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో కాలుష్యం పెరిగిపోయింది. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడి దవాఖాల చుట్టూ తిరుగుతున్నారు. కాలనీవాసులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు డ్రైనేజీ వాటర్‌ను అవుట్లెట్ ఏర్పాటు చేసి బయటకు పంపించడం లేదని స్థానిక నాయకులు మండిపడుతున్నారు.
‘చింతల చెరువు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కనీసం చెత్త తొలగించడం, మురుగునీరు ప్రవాహా మళ్లింపు చర్యలు తీసుకోకపోవడంతో అధికారులపై స్థానికుల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చింతల చెరువును సంరక్షన చర్యలు చేపట్టాలి’ అని బోడుప్పల్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు కొత్త రవిగౌడ్ డిమాండ్ చేశారు.
‘చింతల చెరువును వెంటనే శుద్ధిచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. సుందరీకరణ పనులు చేపట్టి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. డైనేజీ వాటర్ చెరువులోకి చేరకుండా అవుట్లైట్ ఏర్పాటుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. పరిసరప్రాంతంలో ఉన్న సుమారు 10 కాలనీవాసుల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న నేపధ్యంలో తగిన కార్యాచరణ రూపొందింకుకుని త్వరలో జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ప్రభుత్వానికి శాంతియుతంగా నిరసన తెలుపుతాం’ అని రవి గౌడ్ పేర్కొన్నారు.