Supplements | మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో చాలా మంది శరీరానికి కావల్సిన పోషకాల కోసం సప్లిమెంట్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. నిద్రపోవడానికి, జుట్టు, చర్మ ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి, మానసిక స్థితి మెరుగుపడడానికి ఇలా ప్రతి దానికి సప్లిమెంట్స్ మనకు మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటిని చాలా మంది ఉపయోగిస్తున్నారు కూడా. ఇక సప్లిమెంట్స్ ను వైద్యుల సూచనలు లేకుండా కూడా చాలా మంది ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సప్లిమెంట్స్ ను ఎలా, ఎప్పుడు వాడుతున్నారు అనే అంశాలపై వాటిని మన శరీరం గ్రహించే విధానం, వాటి వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఆధారపడి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వాటిని వాడే విధానం తెలియకపోవడం వల్ల వాటిని ఉపయోగించినప్పటికీ ఫలితం ఉండదని వారు చెబుతున్నారు. కనుక ఐరన్ నుండి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వరకు వివిధ రకాల సప్లిమెంట్స్ ను ఏవిధంగా తీసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరన్ సప్లిమెంట్స్ ను చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని రోజూ వాడుతూ ఉంటారు. ఇలా రోజూ వాడడం అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వీటిని రెండు రోజులకు ఒకసారి వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. ఐరన్ సప్లిమెంట్స్ ను అతిగా తీసుకోవడం వల్ల మలబద్దకం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఒమెగా 3 సప్లిమెంట్స్ ను కూడా చాలా మంది ఉపయోగిస్తున్నారు. కానీ ఇవి చేపల వాసన వస్తాయని చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ వాసన తొలగిపోవాలంటే ఈ సప్లిమెంట్స్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయాలని వారు సూచిస్తున్నారు. అలాగే ఇవి వేడికి త్వరగా ఆక్సీకరణం చెందుతాయి కనుక వీటిని ఫ్రిజ్ లో నిల్వ చేయడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఫైబర్ సప్లిమెంట్స్ ను కూడా చాలా మంది ఉపయోగిస్తారు. అయితే వీటిని వాడే వారు తగినంత నీటిని తాగడం చాలా ముఖ్యం. నీటిని ఎక్కువగా తాగకుండా ఫైబర్ సప్లిమెంట్స్ ను వాడడం వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక 10 గ్రాముల ఫైబర్ కు 9 ఔన్సుల నీరు తాగాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకునే వారు దీనిని విటమిన్ కె2 తో కలిపి తీసుకోవాలి. విటమిన్ డి తీసుకుంటే క్యాల్షియంను మీ ఎముకల్లోకి, ధమనుల్లోకి పంపడానికి విటమిన్ కె2 తో కలిపి తీసుకోవాలి. అలాగే ప్రోబయోటిక్స్ తీసుకునే వారు వెంటనే యాంటీ బయాటిక్ మందులను వాడకూడదు. ప్రోబయోటిక్స్ తీసుకున్న 2 లేదా 3 గంటల తరువాత మాత్రమే యాంటీ బయాటిక్ మందులను వాడాలి. అదే విధంగా జిమ్ కి వెళ్లే వారు క్రియాటిన్ సప్లిమెంట్స్ ను ఎక్కువగా తీసుకుంటారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వచ్చే అవకాశం ఉంది. కనుక వీటిని తక్కువ మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకునే ప్రయత్నం చేయాలి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో జింక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ వీటిని ఇతర సప్లిమెంట్స్ తో కలిపి తీసుకోవడం వల్ల శరీరం జింక్ ను ఎక్కువగా శోషించదు. జింక్ సప్లిమెంట్స్ ను తీసుకునే వారు వీటిని క్యాల్షియం, ఐరన్ సప్లిమెంట్స్ తో కలిపి తీసుకోకపోవడం మంచిది. ఈ మధ్య కాలంలో చాలా మంది మెగ్నీషియం సప్లిమెంట్స్ ను కూడా తీసుకుంటున్నారు. నిద్ర నాణ్యతను పెంచడంలో మెగ్నీషియం పాత్ర ఎంతో ఉంది. అయితే మీరు ఎటువంటి మెగ్నీషియం సప్లిమెంట్స్ ను తీసుకుంటున్నారు అనేది ముఖ్యం. నిద్ర కోసం ఈ సప్లిమెంట్స్ ను తీసుకునే వారు మెగ్నీషియం గ్లైసినేట్ ను తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ఈ విధంగా సప్లిమెంట్స్ ను తీసుకునే విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, వీటిని తీసుకునే సరైన విధానం తెలియకపోతే మనం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే సప్లిమెంట్స్ ఏవైనా సరే వైద్య సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సొంత వైద్యం పనికిరాదు. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు లేదా దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది.