చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టి. అనంతరం బస్సుపై పడిపోయింది. దీంతో 21 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తల్లి మరణించగా, తండ్రీ తీవ్రంగా గాయపడ్డారు. వారి ముగ్గురు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు వారిని బస్సులో నుంచి బయటకు తీశారు. తల్లి దండ్రుల కోసం ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ ప్రమాద స్థలిలో కూర్చుండిపోయారు.
తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో చేవెళ్ల మండలం మీర్జాపూర్ సమీపంలో వెగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అనంతరం బస్సుపై పడిపోయింది. దీంతో అందులో ఉన్న కంకర మొత్తం బస్సులో పడిపోయింది. దీంతో ప్రయాణికులు కంకర కింద చిక్కుకుపోయారు. బస్సు డ్రైవర్‌తోపాటు అతనితో వెనక ఉన్న సీట్లలో ప్రయాణికులు మృతిచెందినట్లు తెలుస్తున్నది. మృతుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉన్నది. కంకర కింద చిక్కుకుని బయటకు రాలేక పలువురు ప్రయాణికులు నకరయాతన అనుభవించారు. కాగా, బస్సు కండక్టర్ రాధ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

మరోవైపు సహాయక చర్యల్లో నిమగ్నమైన చేవెళ్ల సీఐ గాయపడ్డారు. బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు మూడు జేసీబీలతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సీఐ శ్రీధర్ కాళ్ల మీద నుంచి ఓ జేసీబీ వెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
