ఒక రొట్టెను మూడు ముక్కలు చేశారనుకుందాం.. ఆ మూడు ముక్కలను కలిపితే అసలు రొట్టె అంత ఉండాలి కదా! కానీ తేడా వచ్చిందంటే? మూడు ముక్కల్ని కలిపినా.. అసలు రొట్టె అంత రాలేదంటే ఎక్కడో తేడా ఉన్నట్లే! ఈ మూడు కాకుండా నాలుగో ముక్క ఏదైనా ఉందా? ఉంటే అదెక్కడికి పోయిందనే అనుమానం రావడం సహజం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మహా నగర విస్తరణ.. మూడు ముక్కలాట కూడా ఇట్లనే తయారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను అవుటర్ రింగు రోడ్డు దాకా విస్తరించి దానికి క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) అని నామకరణం చేసింది. ఆ వెంటనే క్యూర్‌ను మూడు ముక్కలు చేసింది. ఇక్కడే ఓ లాజిక్ మిస్సవుతున్నది.
క్యూర్ విస్తీర్ణాన్ని 2,053 చదరపు కిలోమీటర్లుగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఆపై జీహెచ్ఎంసీతో పాటు రెండు కార్పొరేషన్లుగా విభజించి వాటి విస్తీర్ణాన్ని కూడా గెజిట్‌లో నమోదు చేసింది. కానీ ఈ మూడు ముక్కలను కలిపితే క్యూర్ విస్తీర్ణం రావడం లేదు. ఒకటీ అరా కాదు… ఏకంగా 97 చదరపు కిలోమీటర్ల తేడా కనిపిస్తున్నది. ఇదేదో చిన్న విస్తీర్ణం కాదు సుమా… 300 డివిజన్ల సరాసరి విస్తీర్ణంతో పోలిస్తే వ్యత్యాసం ఉన్న విస్తీర్ణంలో ఏకంగా పద్నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయొచ్చు. మరి… దీని వెనక ఏదైనా సాంకేతిక కారణం ఉందా? ఒకవేళ ఉంటే అధికారులు ఉత్తర్వుల్లో ఎందుకు నమోదు చేయలేదు? కనీసం మాట వరసకైనా ప్రజలకు ఆ కారణమేదో చెప్పాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం… ఇటు అధికారులపైనా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని విస్మరిస్తున్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహా నగరానికి రాజకీయ గ్రహణం పట్టుకున్నది. తెలంగాణకే ఆర్థిక ఇంజిన్‌లా ఉన్న ఈ నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విస్తరించడంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో అడుగులు వేసింది. ఫలితంగా దేశంలోనే అతి పెద్ద గ్రేటర్ కార్పొరేషన్‌గా క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)గా మార్చామంటూ బాకా ఊదిన ప్రభుత్వం.. రోజుల వ్యవధిలోనే మూడు ముక్కలు చేసి విశ్వనగర ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది.
అందుకే ఆది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్ల ఏర్పాటు మొదలు మూడు ముక్కలాట వరకు అనాలోచితంగా… అశాస్త్రీయంగా రాజకీయ బలిపీఠంపై నగరాన్ని ఉంచిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా క్యూర్ నుంచి మూడు ముక్కల వరకు అధికారిక రికార్డులను పరిశీలిస్తేనే ఏకంగా 97 చదరపు కిలోమీటర్ల వ్యత్యాసం కనిపిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే క్యూర్ విస్తీర్ణంతో పోలిస్తే… మూడు ముక్కల విస్తీర్ణం మధ్య ఇంత భారీ తేడా ఉండటం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. మరి… అధికార యంత్రాంగం కీలకమైన ఈ అంశాన్ని విస్మరించడం… ఒకవేళ గుర్తించినా కారణాలను అధికారిక రికార్డుల్లో నమోదు చేయకపోవడమంటే ఎంత అడ్డగోలు విభజన జరిగిందో అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని అవుటర్ రింగు రోడ్డు వరకు విస్తరిస్తూ క్యూర్‌ను ఏర్పాటు చేసింది. అవుటర్ తర్వాత త్రిపుల్ ఆర్ వరకు ప్యూర్‌గా పేర్కొన్నది. ఆపై రాష్ట్ర సరిహద్దుల వరకు రేర్‌గా నామకరణం చేసింది. ఈ క్రమంలో క్యూర్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని జీహెచ్ఎంసీలో అవుటర్ రింగు రోడ్డు వరకు ఉన్న ఏడు కార్పొరేషన్లు, 27 మున్సిపాలిటీలను కలపడంతో విస్తీర్ణం 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని స్పష్టం చేసింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇది భారీ గ్రేటర్ కార్పొరేషన్‌గా అవిర్భవించిందని, అంతకుముందు వరకు మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విస్తీర్ణం 1484 చదరపు కిలోమీటర్లు మాత్రమేనని పాలకులు, మీడియా బాకా ఊదింది. కాంగ్రెస్ ప్రభుత్వం క్యూర్‌ను విశ్వ నగరం వైపు పరుగులు తీయిస్తుందని కొనియాడారు. కానీ ఈ సంబురం రోజుల్లోనే ఆవిరైంది. తొలుత 150 డివిజన్లను 300 డివిజన్లుగా అశాస్త్రీయ విధానంలో పునర్విభజన చేపట్టిన ప్రభుత్వం క్యూర్‌ను మూడు ముక్కలు చేయడం వెనక లాజిక్… ప్రయోజనం … ఏందో ఇప్పటిదాకా అధికారులకే అర్థం కావడం లేదు. దీంతో కేవలం రాజకీయ కోణంలోనే ఈ ఆట ఆడారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇంత భారీ తేడా వెనక కారణమేందో?!
రాష్ట్ర ప్రభుత్వం క్యూర్‌ను మూడు ముక్కలుగా చేసింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను పునర్విభజించి 150 డివిజన్లతోనే ఏర్పాటు చేసింది. మరో 76 డివిజన్లతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇంకో 74 డివిజన్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. గెజిట్‌లో వీటి విస్తీర్ణాన్ని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 689 చదరపు కిలోమీటర్లు… సైబరాబాద్ కార్పొరేషన్ విస్తీర్ణం 613 చదరపు కిలోమీటర్లు… మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ విస్తీర్ణం 654 చదరపు కిలోమీటర్లుగా గెజిట్‌లో చెప్పారు.
దీంతో ఈ మూడింటిని కలిపితే విస్తీర్ణం 1956 చదరపు కిలోమీటర్లుగా వస్తుంది. మరి… క్యూర్ విస్తీర్ణం 2053 చదరపు కిలోమీటర్లు అయినప్పుడు దానిని మూడు ముక్కలు చేసినపుడు 97 చదరపు కిలోమీటర్ల తేడా ఎందుకు వచ్చిందనేది అందరినీ ఆలోచింపజేస్తున్నది. ఇదేదో విస్మరించేంత విస్తీర్ణం కాదు. ఎందుకంటే బెంగళూరులో 98 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. పైగా హైదరాబాద్ మహా నగర పరిధిలోని 300 డివిజన్ల విస్తీర్ణాన్ని సరాసరిగా చూసినప్పుడు ఇంత విస్తీర్ణంలో 14 డివిజన్లను ఏర్పాటు చేయవచ్చు. అలాంటప్పుడు ఇంత భారీ వ్యత్యాసం ఎందుకొచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం, అధికారులు ఎక్కడా మచ్చుకు కూడా ప్రస్తావించలేదంటే అసలు ఈ ప్రక్రియనే ఎంత అశాస్త్రీయంగా ఉందో… ప్రభుత్వ, అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాగా, బెంగళూరును ఐదు కార్పొరేషన్లుగా విభజించినప్పుడు కూడా ఈ తేడా అనేది వచ్చింది. తొలుత 849 చదరపు కిలోమీటర్లు ఉండగా.. ఆపై అది 741 చదరపు కిలోమీటర్లకు వచ్చింది. ఐదు ముక్కలు చేసి వాటిని కలిపి చూస్తే మరో 29 చదరపు కిలోమీటర్ల వ్యత్యాసాన్ని గుర్తించారు. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వమే ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జీఐఎస్ సర్వే ద్వారా ఈ ప్రక్రియను చేపట్టడంతో తేడా వచ్చిందనే సాంకేతిక కారణాన్ని అందులో పొందుపరిచింది. కానీ హైదరాబాద్ మహా నగర విషయంలో మాత్రం ప్రభుత్వం, అధికారులు ఈ తేడాను గుర్తించారో? గుర్తించినా ప్రజలకు చెప్పేదేముంది?? అనుకున్నారో వారికే తెలియాలి.
మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి..
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో మహా నగర పాలనను పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సర్కారు బుధవారం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించగా, సమన్వయం చేసేందుకు పురపాలిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌కు ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను కొనసాగించారు. ఈ మేరకు కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జి. సృజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా టి. వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం కమిషనర్ కర్ణన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఔటర్ రింగు రోడ్డు భూభాగంలోని 1956 చదరపు కిలోమీటర్ల పరిధిలో జీహెచ్ఎంసీ చట్టం-1955 సెక్షన్ -3(1) ప్రకారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒకే రకమైన పాలన వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. 150 డివిజన్లతో జీహెచ్ఎంసీగా ఉండగా, 27 పురపాలికల విలీనంతో 300 డివిజన్లు ఏర్పాటు చేశారు. 60 సర్కిళ్లు, 12 జోన్లతో పరిపాలన వ్యవస్థ కొలువుదీరింది.
కార్పొరేషన్ల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాలు
బాధ్యతలు తీసుకున్న ముఖ్య అధికారులు
జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో ఆయా కమిషనర్లతో పాటు ముఖ్య అధికారుల నియామకాన్ని వెనువెంటనే ముఖ్య అధికారులకు ఆయా బాధ్యతలు అప్పగించడం, ఉత్తర్వులు అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు బాధ్యతలను స్వీకరించారు.
కార్పొరేషన్ : అధికారి : బాధ్యతలు
జీహెచ్ఎంసీ ఎన్.రవికిరణ్ సికింద్రాబాద్ జోన్ జెడ్సీతో పాటు శానిటేషన్ అదనపు బాధ్యతలు
కె. సత్యనారాయణ :అడిషనల్ కమిషనర్ (అడ్మిన్)
కె. శ్రీనివాస్ :చీఫ్ సిటీ ప్లానర్
ఎస్.రత్నాకర్ : చీఫ్ ఇంజినీర్
ఎంఎంసీ : సీఎన్ రఘు ప్రసాద్: అడిషనల్ కమిషనర్ (శానిటేషన్)
కె.వేణు గోపాల్ :అడిషనల్ కమిషనర్ ( అడ్మిన్)
కె.ప్రదీప్‌కుమార్ :చీఫ్ సిటీ ప్లానర్
వి. అశోక్ రెడ్డి చీఫ్ ఇంజినీర్
సీఎంసీ : డాక్టర్ ఎన్ యాదగిరి రావు :అడిషనల్ కమిషనర్ (శానిటేషన్)
బి. గీతా రాధిక : అడిషనల్ కమిషనర్ (అడ్మిన్)
బి. వెంకన్న : చీఫ్ సిటీ ప్లానర్
ఎస్ నిత్యానందం : చీఫ్ ఇంజినీర్
