Massa Massa Video Song | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫస్ట్ గ్లింప్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్, విడుదలైన పాటలు అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమా చుట్టూ భారీ బజ్ నెలకొంది. విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా సినిమా నుంచి ‘మస్సా మస్సా’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది.
ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటకు ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. తన ప్రత్యేకమైన గాత్రంతో సింగర్ విశాల్ మిశ్రా ఈ పాటను ఆలపించారు. గ్రామీణ నేపథ్యం, కుస్తీ పోటీలు, కఠోర శిక్షణ, లక్ష్యం కోసం హీరో చేసే పోరాటాన్ని ఈ పాటలో ఎంతో ప్రభావవంతంగా చూపించారు. ప్రత్యేకంగా ఈ వీడియోలో రామ్ చరణ్ చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, కుస్తీ కోసం ఆయన పడిన శ్రమ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్, రస్టిక్ లుక్‌లో చరణ్ కనిపించిన తీరు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ సాధారణ యువకుడు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే అంశాన్ని ఈ పాట ప్రతిబింబిస్తోంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని కేవలం స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా, భావోద్వేగాలతో నిండిన ప్రేరణాత్మక కథగా రూపొందించినట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇప్పుడు విడుదలైన ‘మస్సా మస్సా’ వీడియో సాంగ్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎంత బలంగా ఉండబోతుందో ఈ పాట ద్వారా మరోసారి అర్థమవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన ‘మస్సా మస్సా’ వీడియో సాంగ్ మాత్రం సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.