US firing : అమెరికా (USA) లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఐయోవా (Iowa) లోని మస్కటిన్ (Muscatine) టౌన్ తూపాకీ తూటాలతో రక్తమోడింది. ఈ కాల్పుల ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారితోపాటు కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించాడు. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా ఈ కాల్పులు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఘటనపై మస్కటిన్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12:12 నిమిషాలకు 210, పార్క్ అవెన్యూలోని ఒక నివాసంలో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ నలుగురు వ్యక్తలు తుపాకీ తూటాల గాయాలతో రక్తపుమడుగులో పడివున్నారు. అప్పటికే వారంతా మరణించారు.
ఈ కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని మస్కటిన్కే చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్‌ఫార్లాండ్ (Ryan Willis McFarland) గా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కాల్పులు జరిగిన గంట సమయంలోనే అతన్ని రివర్‌ఫ్రంట్ ట్రైల్ వద్ద గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో గుర్తించారు. అతన్ని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరిస్తుండగానే అతను తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంతకుముందే 1509 మిల్ స్ట్రీట్, 808 గ్రాండ్‌వ్యూ అవెన్యూలో కూడా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ రెండుచోట్లా కూడా ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. ఇంట్లో మరణించిన నలుగురు, బయట మరణించిన ఆ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ దర్యాప్తులో మస్కకాటిన్ ఫైర్ డిపార్ట్మెంట్, కౌంటీ షెరీఫ్, ఐయోవా స్టేట్ పెట్రోల్, డివిజన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వంటి విభాగాలు పాల్గొన్నాయి.