శివుడు నాలో ఉన్నాడు. మీలో ఉన్నాడు.. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు.జ్యోతిస్వరూపుడై మానవుల హృదయాంతరాళాలలో దాగి ఉన్న ఈ శివుడిని ఎలా కనుగొనాలి?అది మానవ మాత్రులకు సాధ్యమయ్యే పనేనా?శివుడి మూలతత్వాన్ని, స్వరూపాన్ని గ్రహిస్తే, శివుడి బోధనలను, ఉపాసనలను తెలుసుకుంటే..ఆ పరమేశ్వరుడు ప్రబోధించిన ఆధ్యాత్మిక జీవన రహస్యాలు అర్థం అవుతాయి.ఆ తత్వాన్ని అన్వయించుకుని లౌకిక జీవనంలో అడుగులు వేస్తే, మనుసులోని కారు చీకట్లు క్రమంగా తొలగిపోతాయి. అప్పుడే అంతరంగంలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది.
శివ పదం.. ముక్తిప్రదం. శివ పథం.. మోక్షమార్గం!మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈశ్వరుడి లీలావిశేషాలను రేఖామాత్రంగా తెలుసుకుందాం.
శివుడు, రాజేశ్వరుడు, మహదేవుడు, రుద్రదేవుడు, నీలకంఠుడు, శంకరుడు, పశుపతి, మహేశ్వరుడు,త్రిపురాంతకుడు, భస్మధారుడు, వృషభవాహనుడు, గంగాధరుడు, చంద్రశేఖరుడు, పినాకపాణి, కైలాసవాసి..ఇలా శివయ్యకు ఎన్నో పేర్లు. ఆయనలో ఉన్న వివిధ లక్షణాలను, శక్తులను అవి సూచిస్తాయి.ఇది ఎలా ఉన్నా శివుణ్ని తలవగానే మనకు కళ్లమందు సాక్షాత్కరించేది ఆయన లింగరూపమే.లింగస్య దర్శానాత్ పాపం క్షయం గచ్ఛతి వైదిజ్యశివలింగం దర్శనం మాత్రం చేతనే పాపం నశిస్తుందని సౌరపురాణం చెబుతుంది.లింగం అంటే ఏమిటి? శివుడు లింగ స్వరూపుడు కావటానికి కారణం ఏమిటి? శివుడికి లింగభావం ఏ విధంగాకలిగింది. శివుడిని లింగరూపంలో ఎందుకు పూజించాలి? అనేవి సహజంగా అందరికీ కలిగే సందేహాలు.
ఒకప్పుడు శ్రీకృష్ణుడికి కూడా ఈ సందేహాలు వచ్చాయి. ఉపమన్యు మహర్షిని అడిగి.. వాటిని నివృత్తి చేసుకున్నాడు.
లింగంలో రెండు బీజాక్షరాలు ఉంటాయి. మొదటిది-లిం., రెండోది -గం., కంటికి కనిపించకుండా అవ్యక్తంగా ఉన్న దైవాన్ని ‘లిం’ అంటే, వ్యక్తం చేసే చిహ్నాన్ని ‘గం’ అంటారు. అవ్యక్తంగా ఉన్న దైవాన్ని వ్యక్తం చేసే చిహ్నమే లింగం. దాని ప్రకారం శివలింగం అంటే శివుడిని వ్యక్తం చేసే చిహ్నమే.ఒక విగ్రహాన్ని చూడగానే జీవుల హృదయాలలోఏ విధంగా ఆ దైవానికి సంబంధించిన రూపంకనిపిస్తుందో, శివలింగాన్ని చూడగానే ఆ రూపంసాక్షాత్కరిస్తుంది.‘లయనా ల్లింగముచ్చతే’, ‘లీయతే ఇతి లింగం’ అన్న వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. లీనం చేసుకునేది ఏదో.. దానిని లింగం అంటారు. సర్వం దేనిలో లయిస్తుందో అదే లింగం. మనసు దేనియందు లయిస్తే జీవుడు సాక్షాత్తు శివుడిగా ప్రకాశిస్తాడో, ఆ పరంధామమే లింగం. ప్రాణం దేనియందు లయిస్తే జీవుడు ఆత్మసాక్షాత్కారం పొంది, బ్రహ్మానంద సుఖాన్ని అనుభూతిగా పొందుతాడో, ఆ పరమపదమే లింగం.
శివలింగం ఎప్పుడూ పీఠికతో కూడి ఉంటుంది. దానిని పానపట్టం అని కూడా అంటారు. లింగం పరబ్రహ్మానికి సంకేతం అయితే, పానపట్టం పరాశక్తికి సంకేతం. అగ్నిలో దహనశక్తి ఏ విధంగా అంతర్గతంగా ఉంటుందో, ఆ విధంగా శివుడిలో శక్తి ఉంటుంది. అగ్ని నుంచి దహనశక్తిని వేరు చేయటం అసాధ్యం, అసంభవం. అదే విధంగా శివుడి నుంచి శక్తిని వేరు చేయటం అసాధ్యం. ఈ జ్ఞానాన్ని బహిర్గతం చేయటం కోసమే పానపట్టంతో సహా లింగాన్ని పూజిస్తారు. అందుకే స్కాంద పురాణం ఇలా వ్యాఖ్యానిస్తుంది.ఆకాశం లింగ మిత్యాహుః పృథివీ తస్య పీఠికా!ఆకాశం లింగంగా, భూమియే వేదికగా బ్రహ్మాండాన్ని ఆవరించిన మహాదైవమే శివుడు.
శివుడు మాయతో కూడి సదాశివుడిగా ఆవిర్భవించాడు. లయ కార్యం నిమిత్తం సదాశివుడే రుద్రుడిగా ఉద్భవించాడు. అందుకే రుద్రుడు తాను నామరూపాలు లేని లింగ స్వరూపుడిగా వ్యక్తమయ్యాడు. లింగం అంటే అనంతమైన దివ్యతేజస్సు అని.. ఆ తేజస్సు స్వయం ప్రకాశం అని విశదపరిచాడు.శివలింగానికి మూలం బ్రహ్మ స్వరూపం. మధ్యమ భాగం విష్ణు స్వరూపం. పైభాగం సదాశివ స్వరూపం. పానపట్టం పరాశక్తి స్వరూపం. ఎవరైతే శివలింగారాధన చేస్తారో, వారు బ్రహ్మవిష్ణురుద్రులను, పరాశక్తిని ఆరాధించినట్టే.
వ్యావహారిక స్థాయిలో బాహ్యలింగం, వేదిక ఉంటాయి. పారమార్థికంగా చూస్తే.. భాషకు, భావనకు, మనసుకు అందని జ్ఞాన జ్యోతిర్లింగం సదా స్వయం ప్రకాశమానమై ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం లేదా శివ సాక్షాత్కారం పొందిన వారు మాత్రమే ఈ అలౌకిక జ్యోతిర్లింగాన్ని దర్శించగలుగుతారు. అందుకే సౌరపురాణం దేవత్వం లోకపాలత్వం రుషిత్వం దావేశతా లోకేశ్వరత్వమీశత్వం లింగస్యాభ్యర్చనాద్భవేత్ దేవత్వం, లోకపాలత్వం, రుషిత్వం, లోకేశ్వరత్వం, ఈశత్వం, విద్యాధరాధి సకలాధిపత్యం, సర్వసుఖాలు శివార్చన వలన కలుగుతాయి అని చెప్పింది.
శివుడు గొప్పా? విష్ణువు గొప్పా?
శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్నా ఇద్దరూ ఒకటే. ఒకే శక్తి. సదాశివుడు సదా విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? ఈ సందేహం చాలామందికి కలుగుతుంటుంది. ఒకప్పుడు దేవతలకు కూడా ఇలాంటి సందేహమే వచ్చింది. ‘రామస్య ఈశ్వరః’ అనేది నానుడి. అంటే రాముడికి ఈశ్వరుడే ప్రభువు అంటే శివుడే గొప్పవాడని అర్థం వస్తుంది. శివ ధనస్సును విరిచిన రాముడు ఏ విధంగా శివుడి కన్నా తక్కువ అని తమలో తాము తర్కించుకున్నారు దేవతలు. ఆ తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఇదే విషయం అడిగారు. ‘దీనికి ఇంత దూరం వచ్చారా? ఈశ్వరుడే రాముడికి అధికారి అని ఉండనే ఉంది కదా? నాకంటే శివుడే గొప్పవాడు’ అని వాళ్లకు సమాధానం చెప్పాడు.
దేవతలకు సంతృప్తి కలగలేదు. మొహమాటంతో విష్ణువు ఇలా అని ఉంటాడని సమాధానం కోసం శివుడి చెంతకు వెళ్లారు. ‘ఇందులో సందేహించటానికి ఏం ఉంది? రాముడే ఈశ్వరుడిగా కలవాడు. విష్ణువే తనకు అధికారి’ అని శివుడు సమాధానమిచ్చాడు.
వీళ్లిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. వాళ్లు చెప్పిందంతా విని ‘రామేశ్వరుడంటే రాముడొకరు, ఈశ్వరుడొకరూ అని అర్థం కాదు. రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు’ అని సమాధానం చెప్పారు.
‘వీళ్లద్దరికీ భేదం లేదు’ అని సెలవిచ్చి ఒక మాట చెప్పారు. విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః ఉభయోరప్యతృప్తానా మాత్మభూ కర్మధారయమ్ శ్రుతులు ఈ మాట చెబుతాయి. శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
శివుడే విష్ణువు. విష్ణువే శివుడు. శివుడి హృదయం ఏమిటని పరిశీలిస్తే విష్ణువు ఉంటాడు. విష్ణువు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే.. శివుడిని దూషిస్తే అది విష్ణువుకి కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే శివుడికి ఆగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.

లోకం లింగాత్మకం
లోకం అంతా లింగాత్మకం అని గ్రహించి శివలింగారాధన చేయాలి అని ఆగమశాస్త్రం చెబుతుంది. లింగం తయారుచేసే పదార్థాన్ని బట్టి దాని ఫలితాలు అంటే దైవత్వం, శ్రేష్ఠత్వం ఆధారపడుతుందని చెబుతారు. మట్టి లింగాన్ని ఆరాధిస్తే ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. పుట్టమన్నుతో తయారుచేసిన శివలింగాన్ని పార్థివ లింగం అంటారు. సర్వ మంత్రాలలో ఓంకారం ఎలా శ్రేష్ఠమైనదో, అదే విధంగా లింగాలలో పార్థివ లింగం శ్రేష్ఠమని చెప్పారు పెద్దలు.రాతి లింగాన్ని ఆరాధిస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. స్పటిక లింగారాధన సర్వకామ ప్రదంగా చెబుతారు. ఈ లింగాన్ని ఆరాధిస్తే తేజస్సు, కీర్తి, యశస్సు, సకల భోగాలు కలుగుతాయి. లక్ష్మీదేవి సదా ఈ లింగాన్ని ధరించి శివారాధన చేస్తుందని ప్రతీతి.
ఇవికాక ఇంకా పద్మరాగ లింగం, కాశ్మీర లింగం, పుష్యరాగ లింగం, ఇంద్రనీల లింగం, గోమేధిక లింగం, పగడాల లింగం, మరకత లింగం, ముత్య లింగం, రజత లింగం, బంగారు లింగం, వజ్ర లింగం, పాదరస లింగం వంటివి ఉంటాయి. అలాగే అష్టలోహ లింగం, అష్టధాతు లింగం గురించిన విశేషాలు పురాణాల్లో కనిపిస్తాయి.
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణదర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివలింగం
ఏ లింగాన్ని దేవతలు, రుషులు తరతరాలుగా అర్చిస్తున్నారో, ఏ లింగం కోరికలను కాల్చివేసి కరుణను కలిగిస్తోందో, ఏ లింగం రావణాసురుని గర్వం నాశనం చేసిందో అటువంటి సదాశివునికి నేను నమస్కరిస్తున్నాను అనేది దీని తాత్పర్యం. ఆది శంకరాచార్యులు రచించిన లింగాష్టకం లోనిది ఈ శ్లోకం. శివలింగం గొప్పతనాన్ని, పవిత్రతను, శక్తిని కీర్తించే ఎనిమిది శ్లోకాల సంకలనం లింగాష్టకం. బ్రహ్మ, విష్ణు ఇతర దేవతలు నిరంతరం శివలింగాన్ని పూజిస్తూ ఉంటారని, లింగార్చనతో సకల దరిద్రాలూ తొలగుతాయని, సమస్త దుఃఖాలూ పటాపంచలు అవుతాయని లింగాష్టకం చెబుతుంది. సర్వమూ శివలింగం నుంచి ఉద్భవించి తిరిగి అందులోనే లీనమవుతుందనే సత్యాన్ని చెబుతుంది. శివసన్నిధిలో లింగాష్టకాన్ని పఠించేవారికి శివలోక ప్రాప్తి కలుగుతుందనే ఫలశ్రుతిని కూడా మనకు అందించారు ఆదిశంకరులు.
ఏ పూలతో.. ఏయే ద్రవ్యాలతో..
ఏ పుష్పాలతో శివుణ్ని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయనేది శాస్ర్తాలు వివరించాయి. ఒక జిల్లేడు పువ్వుతో ఆరాధిస్తే పది సువర్ణాలు దానం చేసినంత ఫలితం కలుగుతుందని, వేయి జిల్లేడు పూలతో పూజిస్తే వచ్చే ఫలం ఒక గన్నేరు పువ్వుతో కలుగుతుందట. వేయిగన్నేరు పూలతో పూజ చేస్తే వచ్చే ఫలితం ఒక తామరాకుతో చేస్తే కలుగుతుందట. వేయి తామరాకులతో చేసే ఫలం ఒక బిల్వపత్రంతో పూజిస్తే కలుగుతుందని శాస్త్ర వచనం. మారేడు దళాలతో శివుడిని ఆరాధిస్తే శాశ్వత శివలోక ప్రాప్తి సిద్ధిస్తుందనే కథలు అందరికీ పరిచయంలో ఉన్నవే. మల్లె, ఉమ్మెత్త, నల్లకలువ పుష్పాలు, వాగుడు, తుమ్మి, జమ్మి ఆకుల గురించి కూడా చెప్పారు.
అభిషేక ప్రియుడు.. శివుడు
శివుడు అభిషేక ప్రియుడని శాస్త్ర వాక్యం. శివారాధనలో నామ జపం, శివ ధ్యానం, రుద్ర పఠనం ఎంతటి మహత్తరమైనవో, అంతకంటే మహిమాన్వితమైనది, శక్తిమంతమైనది అభిషేకం. సనాతన సంప్రదాయంలో ఒక్క శివుడికి మాత్రమే అభిషేకం జరిగేది. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదిదేవతలకు కేవలం అర్చన, పూజ మాత్రమే జరిగేవి.భస్మాభిషేకం… భస్మంతో శివుణ్ని అభిషేకించటం ఆధ్యాత్మికంగా శక్తిమంతమైనది. భస్మాభిషేకం సర్వోన్నతమైనదని పురాణాలు చెబుతున్నాయి.భస్మం అశాశ్వతమైన భౌతిక ప్రపంచానికి ప్రతీక. దీనిని సమర్పించటం ద్వారా భక్తుడిలోని అహంకారం తొలగి మోక్ష మార్గంలో పురోగతి లభిస్తుందని నమ్ముతారు. మారేడు చెట్ల బెరడు లేదా వేర్ల నుంచి తీసిన భస్మంతో అభిషేకం చేస్తే దారిద్య్రం తొలగి ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం. భస్మాభిషేకం చేయటం వల్ల దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయని పెద్దల మాట.
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరం ఆలయంలో ప్రతిరోజూ ఉదయం నిర్వహించే భస్మహారతి విశేషమైనదిగా చెబుతారు. ప్రతి నెలా మాసశివరాత్రి రోజున జ్యోతిర్లింగక్షేత్రాలలో శివుడికి భస్మాభిషేకం చేస్తారు. నమక చమకాలను పఠిస్తూ శివుడికి అభిషేకం జరిపిస్తారు. ఇందులో నమకం శివుడికి నమస్కరిస్తూ ఉగ్రరూపాన్ని శాంత పరచమని కోరుకుంటే, చమకం భౌతిక, ఆధ్యాత్మిక వరాలను
అందించమని కోరుతుంది.
ఉదాహరణకు చమకం ఒక అనువాకంలో.. “శం చ మే మయశ్చమే ప్రియం చమే నుకామశ్చమే, కామశ్చమే, సౌమనసశ్చమే భద్రం చ మే శ్రేయచ్ఛమే”అని ఉంటుంది.చ..మే.. అంటే నాకు అని అర్థం. తన నిత్య జీవితానికి, ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైన వాటిని అందించాలని భక్తుడు కోరుకుంటాడు. మనస్తత్వ శాస్త్రంలో ఇప్పుడు బహు ప్రచారంలో ఉన్న ‘మానిఫెస్టేషన్’ అనేది చమకం పఠించటం ద్వారా పరిపూర్ణంగా సిద్ధిస్తుందని చెప్పవచ్చు.ఇకపోతే అభిషేకం ప్రతికూలతలను తగ్గించి సానుకూల శక్తిని, శాంతిని ప్రసాదించి, కోరికలను తీరుస్తుందని భక్తుల విశ్వాసం. మరి ఏ ద్రవ్యాలు సమర్పించాలి? ఆవుపాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూతి, పసుపు, కుంకుమ, పన్నీరు గంధం, నవధాన్యాలు తదితరాలతో అభిషేకం చేస్తారు.
వాటితోపాటు చెరకు రసం, మామిడి రసం ఇతర పళ్ల రసాలతోనూ అభిషేకం చేయటం చూస్తుంటాం. నువ్వుల నూనె, కొబ్బరినూనె, వేప నూనె, బాదం నూనె, విప్ప నూనె, అష్టమూలికా తైలంతో కూడా అభిషేకం చేస్తారు. దాదాపు 100కి పైగా ద్రవ్యాలు అభిషేకంలో వినియోగిస్తున్నారు. పాలతో అభిషేకం వల్ల సర్వ సౌఖ్యాలు, పెరుగు వల్ల ఆరోగ్యం, బలం, తేనె వల్ల తేజోవృద్ధి, సంపద, చక్కెర వల్ల దుఃఖనాశనం, నెయ్యి వల్ల ఐశ్వర్యప్రాప్తి కలుగుతాయని శాస్త్రం చెబుతున్నది. ఆర్థిక స్తోమత, అవకాశాన్ని బట్టి ఏ ద్రవ్యాన్ని అయినా ఎంచుకోవచ్చు. నిశ్చల భక్తితో కాసిన్ని జలాలు లింగంపై పోసినా చాలు! శివుడు తృప్తి చెంది సర్వ ఐశ్వర్యాలను, సకల సంపదలను ప్రసాదిస్తాడు. చుట్టుపక్కల వాళ్లను చూసి, సామాజిక మాధ్యమాలను చూసి మనకు ఏదో లేదనే అపరాధ భావనకు లోనుకావటం మంచిది కాదు. చిత్తశుద్ధి లేని శివపూజలు ఫలించవు.
ఆదిగురువు శి..వ..
ఆదియోగి, ఆదిగురువు శివుడు. శి..వ.. ‘ఏదైతే లేదో’ అది దాని అర్థం. ఏదైతే లేదో అది ఒక పదార్థంగానో లేదా ఏదైతే ఉన్నదో అయినప్పుడు మనం ఆ పార్శ్వాన్ని బ్రహ్మం అంటున్నాం. శివుని రూపం, శివుని జీవనం, శివ కుటుంబం ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను చాటి చెబుతాయి.
శివపార్వతుల వివాహం ఒక అందమైన ఘట్టం. పార్వతి యువరాణి కనుక ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచారు. శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూతి రాసుకుని వచ్చాడు. రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి ఉన్నాడు. శివుని రూపం చూసి కళ్లు తిరిగి పడిపోయింది పార్వతి తల్లి. దాంతో పార్వతి ‘మా అమ్మ కోసం ప్రశాంతమైన రూపం ధరించండి’ అని కోరింది. అప్పుడు ఆయన అందమైన రూపం ధరించి వచ్చాడు. తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న శివుణ్ని చూసి అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.పెళ్లి సమయంలో పార్వతి తండ్రి వధువు గొప్పతనాన్ని చాటుతూ వంశచరిత్ర మొత్తం చదివాడు. ఆ తర్వాత శివుడు మౌనంగా కూర్చుండిపోయాడు. ఆయన పరివారం కూడా ఏవో అర్థం కాని శబ్దాలు చేశారు. ఆ మాటలకు అర్థాలు ఎవరికీ తెలియలేదు. అదంతా హిమవంతునికి అవమానంగా తోచింది. ఆయన తల్లిదండ్రులెవరో తెలియదు. ఏ వంశమో తెలియదు. ఇలాంటి పుట్టుపూర్వోత్తరాలు లేని వాడికి తన కూతురినిచ్చి పెళ్లి చేయనని కోపంతో లేచాడు పర్వతరాజు. పెళ్లికి అతిథిగా వచ్చిన నారద ముని తన ఏకతారా వాయించాడు. ఇదే అతని మూలం అని అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు.
శివుని మూలం నాదం. ప్రకంపన నాదం నుంచే ఆయన ఆవిర్భవించాడు. తల్లిదండ్రులు లేరు, తాత ముత్తాతలు లేరు. వంశవృక్షమూ లేదు. ఆయన స్వయంభువు.. స్వయంగా తనను తాను సృష్టించుకున్నవాడు.ఓసారి శివునికి అకస్మాత్తుగా చెమట పట్టింది. దానితో పార్వతికి అనుమానం వచ్చింది. తన సవతి గంగమ్మ ఆయన మదిలో చేరి అల్లరి చేస్తోందేమో.. అందుకే అయ్యవారు పరవశిస్తున్నాడేమోనని కలవరపడింది. వెంటనే నిలేసింది. ‘నేను గంగను తలచుకోవటం లేదు, నన్ను నమ్ము’ అని బతిమాలుకున్నాడు శివుడు. ఆమె నమ్మటం లేదని తెలిసి ‘మా అమ్మ మీద వొట్టు’ అన్నాడు సాధారణ వ్యక్తిలా. ‘అబ్బా! అమ్మ లేని వాడివి. ఈ ఒట్టేస్తే నేనెలా నమ్మేది’ అని కడిగిపారేసింది పార్వతి.‘అవును.. నాకు అమ్మా, అయ్యా లేరు. నీకు అత్తమామలేరు’ అంటూ చమత్కరించాడు.
శివతాండవం దేనికి సూచిక?
శివుడు ప్రభా మండలం మధ్య నృత్యం చేస్తూ కాలం, అనంత విశ్వప్రక్రియలను సూచిస్తాడు. ఆయన చేసే నటరాజ నృత్యం నిరంతర సృష్టి, స్థితి, లయల చక్రాలను సూచిస్తుంది. సృష్టి: ఆయన చేతిలోని డమరుకం విశ్వసృష్టికి అవసరమైన ఆదిమ నాదాన్ని సూచిస్తుంది. స్థి తి: ఆయన కుడిచేయి అభయ ముద్ర భక్తులకు రక్షణ, నిర్భయతను ప్రసాదిస్తుంది. లయ: మరో చేతిలో ఉన్న అగ్ని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, భౌతిక ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. తిరోధానం: పాదం కింద అపస్మార పురుషుడు అజ్ఞాన రాక్షసుడు. అతన్ని అణగదొక్కి సత్యం, జ్ఞానం ప్రాధాన్యాన్ని చెబుతుంది. అనుగ్రహం: ఎత్తిన ఎడమపాదం ఆత్మవిముక్తిని సూచిస్తుంది. ఆధునిక భౌతిక శాస్త్రంలో అణువుల శక్తిమంతమైన కదలికలను, సృష్టి విధ్వంసాల నిరంతర శక్తి నృత్యాన్ని… ఈ తాండవం ప్రతిబింబిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తారు.
నీలకంఠుడు..
మేరు పర్వతాన్ని మధించినప్పుడు సముద్రం దిగువ నుంచి వచ్చిన భయంకరమైన హాలాహలాన్ని చూసి దేవతలంతా భయపడ్డారు. ఇది ప్రపంచం మొత్తం వ్యాపిస్తే జీవులన్నీ నాశనం అవుతాయని ఏదో ఒకటి చేయమని శివుణ్ని కోరారు. తన సొంత శ్రేయస్సు గురించి ఆలోచించకుండా ఆ విషాన్ని తాగేశాడు శంకరుడు. అది చూసి ఆయన భార్య పార్వతి ఆయన గొంతు పట్టుకుంది. దాంతో విషం గొంతు వద్దే ఆగిపోయి, కంఠం నీలిరంగులోకి మారిపోయింది. ఆయన పేరు నీలకంఠుడిగా స్థిరపడిపోయింది. నిత్య జీవితంలో విషపూరితమైన అంశాలను పూర్తిగా జీర్ణించుకుంటే ప్రాణానికే ప్రమాదం. అందుకే శివుడు గొంతు వద్ద దాచుకున్నట్టు.. ఎప్పుడు వదిలేయాలంటే, అప్పుడు వదిలేయటానికి వీలుగా ఉంచుకోవాలి.
ఏడు కర్మనియమాలు
శివుడు బోధించిన ఏడు కర్మనియమాలు మానవాళికి ఆధ్యాత్మిక సమతుల్యతకు, ఉన్నతికి దారి చూపుతాయి. సృష్టి స్థితి లయ తత్వాలను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే.. వ్యక్తులు సమతుల్యతతో ఎలా జీవించవచ్చో అర్థం అవుతుంది. మీరు ఎలాంటి చర్యలకు పాల్పడతారో, ఇతరులకు ఏదైతే చేస్తారో అది మీకు తిరిగి వస్తుందని కర్మ సిద్ధాంతం చెబుతుంది. ఇది అర్థం చేసుకున్న వ్యక్తులు తమ ఆలోచనలు, మాటలు, చర్యల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే వ్యక్తులు మార్పులను స్వీకరించటం ద్వారా పరివర్తన చెందగలుగుతారని శివుడి జీవితం మనకు చెబుతుంది. ఫలితాల పట్ల విపరీతమైన మమకారం పెంచుకోకుండా ‘డిటాచ్మెంట్’ అలవరచుకోమని అంటుంది. మాయ వలలో చిక్కుకోకుండా అంతరంగపు లోతుల్లోకి చొచ్చుకుపోవాలి. అన్ని జీవాలు ఒకే శక్తికి అనుసంధానం అయ్యాయని అదే అనంతమైన జీవశక్తిగా గుర్తించాలి.
శివుని కర్మ సిద్ధాంతంలో ఏడు అంశాలివి.
ఓం నమఃశివాయ
దీనికి సాటిరాగల మంత్రం మరొకటి లేదని అంటారు. శివుని షడక్షరీ మంత్రాన్ని జపించిన వారికి ఏ మంత్రాలతో, శాస్ర్తాలతో పని లేదు. ఈ మంత్రం జపం చేసిన వారికి సత్య జ్ఞానం కలుగుతుందని పెద్దలు చెప్పే మాట. అంత్యజుడు గాని, అధముడు గాని, మూర్ఖుడు గాని, పండితుడు గాని ఎవరైనా ఈ మంత్రాన్ని నిష్ఠగా ఉపాసిస్తారో.. వాళ్లు పాప బంధం నుంచి విముక్తులవుతారు.
శివరాత్రి ఎందుకు?
ప్రతి చాంద్రమాన మాసంలోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు వచ్చే రోజును శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రుల్లో ఫిబ్రవరి-మార్చిలో (మాఘం) వచ్చే రోజుకి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ రాత్రి భూమి ఉత్తర గోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలో శక్తి సహజంగా ఉప్పొంగుతుంది. ఈ రోజు ప్రకృతి మనుషుల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవటానికి ఈ సంస్కృతిలో రాత్రంతా జరిగే పండుగను ఏర్పాటు చేశారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి వెన్నెముకను నిటారుగా ఉంచటం ద్వారా శక్తులను సహజంగా ఎగిసిపడటానికి సహకరించవచ్చు.
యోగ సంస్కృతిలో శివుడిని ఆదియోగిగా చెబుతారు. ధ్యానంలో ఎన్నో సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ పరిస్థితులలో నివసించే వారు మహాశివరాత్రిని శివుని పెళ్లి రోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా భావిస్తారు. సన్యాసులకు మాత్రం ఈరోజు ఆయన కైలాస పర్వతంలో ఒకటైన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా మారిపోయాడు.
‘ఎవరైతే ప్రాపంచిక శక్తుల పట్ల అనురాగాన్ని, మోహాన్ని, కోరికలను, చింతలను త్యజించి, అపరిగ్రహాన్ని ఆచరిస్తూ, జీవితాంతం వైరాగ్యాన్ని పాటిస్తూ లింగ స్వరూపంలో నన్ను ఆరాధిస్తారో వారికి ఒక్క జన్మలోనే నేను పరమపదాన్ని ప్రసాదిస్తాను’ అని ఈశ్వరుడి మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. స్వామి ఆలయాలను సందర్శిద్దాం. అభిషేకం, ఉపవాసం, జాగరణలతో ఆరాధన చేద్దాం. మనలోనే శివుడిని దర్శించుకుందాం!
ఫలశ్రుతి..
శివ రూపంలో విశిష్టతలను, శివ ధ్యానంలో ఫలితాలను అర్థం చేసుకున్నారు కదా.. ఇంతకు మించిన వ్యక్తిత్వవికాస పాఠం ఇంకేం ఉంటుంది. శివయ్య మాదిరిగా రక్తధారలున్న ఏనుగు చర్మాన్ని మనం తొడుక్కోనవసరం లేదు. ఒంటి నిండా భస్మాన్ని పూసుకోనవసరం లేదు. మీ జీవితభాగస్వామికి శరీరంలో అర్ధభాగం ఇవ్వనవసరంలేదు. శివ పరివారంలోని వాహనాల్లో మాదిరిగా ఒకరికొకరు శత్రువులైన వారితో సహ
జీవనం చేయవలసిన అవసరం లేదు. తామరాకుపై నీటిబొట్టు ఎలా నిలకడగా ఉండదో మానవ జీవితం కూడా అస్థిరమైనదన్న స్పృహతో మెలగాలి. ధనకాంక్షను తగ్గించుకుని కర్మ ఫలితంగా లభించినదానితో తృప్తి చెందాలి. మీ అంతరంగంలో ఉన్న శివుడిని అందుకోవటానికి నిత్యం సాధన చేయాలి. అప్పుడే మీకు ఆత్మసాక్షాత్కారం సిద్ధిస్తుంది.కర్తవ్యం వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ చేయవలసిన పనుల గురించి
పరమేశ్వరుడు ఈశ్వరగీతలో నాలుగు రకాలుగా చెప్పాడు.
నిత్య కర్తవ్యం: వ్యక్తి ఎప్పడూ చేయవలసిన పనులు. అంటే సత్యం, అహింస, దయ, ఔదార్యం లాంటివి నిరంతరం కొనసాగించాలి.
నైమిత్తక కర్తవ్యం: కొన్ని సందర్భాల్లో చేయవలసిన పనులు. అవి యజ్ఞం, యాగం, పూజ.కామ్య కర్తవ్యం: తన కోసం తాను చేయవలసిన పనులు.అవి సంపద, కీర్తి, భోగం..నిష్కామ కర్తవ్యం: ఇది ఇతరుల కోసం చేయవలసిన పనులు. సేవ, దానం,పరోపరకారం లాంటివి.
జ్ఞానం
ఒక వ్యక్తి ఆత్మను తెలుసుకోవటమే జ్ఞానం అని చెబుతాడు ఈశ్వరుడు. ఈ జ్ఞానాన్ని నాలుగు రకాలుగా విభజించాడు. విద్యా జ్ఞానం: ఒక వ్యక్తి బాహ్య జ్ఞానాన్ని ఈ పేరుతో పిలుస్తారు. శాస్ర్తాలు, కళలు, సాహిత్యం వంటివి ఇందులోకి వస్తాయి. అవిద్యాజ్ఞానం: అంతరంగంలో ఉండే అంశాలు ఇందులోకి వస్తాయి. ఆత్మ, పరమాత్మ, మోక్షం లాంటివి.. పరాజ్ఞానం: పరమాత్మకు సంబంధించి వ్యక్తిలో ఉండే జ్ఞానాన్ని ఈ పేరుతో పిలుస్తారు. బ్రహ్మ, ఆత్మ, మోక్షం గురించి ఇవి చెబుతాయి.అపరాజ్ఞానం: వ్యక్తికి ఉండే అపరాజ్ఞానాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ప్రపంచం, మాయ, అవిద్య లాంటివి ఇందులోకి వస్తాయి.
చిదానంద రూపం..శివోహం
ఆదిశంకరాచార్యులు రచించిన ‘నిర్వాణ షట్కం’లోనిది ఈ శ్లోకం.నేనెవరు? అన్న ప్రశ్నకు ఇందులో సమాధానం ఉంటుంది.
నేను ఆత్మను.. నేను శివుడిని అన్న అర్థం ఇందులో ఉంది.అద్వైత వేదాంత తత్వాన్ని తెలుపుతూ, మనిషి తనను తాను
పరిమితులు లేని ఆత్మగా తెలుసుకోవాలని చెబుతుంది.శివుడు జాగృతికి ప్రతీక.మీలో ఉన్న ప్రశాంతమైన,శక్తిమంతమైన, జాగ్రదావస్థను
శివుడిగా భావించండి.
అహంకారంతో, ఆవేశకావేశాలతో ఇతరులతో తలబడకుండా ప్రశాంతంగా, దయార్ద్ర హృదయులై ఉండటానికి ప్రయత్నించండి.మీ శ్వాసపైన ధ్యాసను ఉంచండి. ధ్యానంలో శివ నామాన్ని జోడించండి.
మోక్షసాధన
మోక్షసాధన అనేది వ్యక్తి ఆత్మను, పరమాత్మలో కలపటం అని వివరిస్తాడు ఈశ్వరుడు. జ్ఞానయోగం: వ్యక్తి జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందటం ఇందులోకి వస్తుంది. భక్తి యోగం: భక్తి ద్వారా మోక్షాన్ని పొందటాన్ని భక్తి యోగం అంటారు. కర్మయోగం: కర్మ ద్వారా మోక్షాన్ని పొందటం కర్మయోగం.రాజయోగం: రాజయోగం ద్వారా మోక్షం పొందటాన్ని ఈ పేరుతో పిలుస్తారు.
ఈశ్వరగీత ఏం చెబుతుంది?
బదరికాశ్రమంలో వశిష్ఠ మహర్షి మరి కొందరు రుషులు విష్ణువును దర్శించి, ‘స్వామీ, మాకు బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది? పరమ పదం ఏ విధంగా సంప్రాప్తం అవుతుంది? జ్ఞానోపదేశం చేయండి’ అని ప్రార్థించారు. రుషులు మాటలు విన్న నారాయణుడు, ‘మీకు ఉపదేశం చేయగల అధికారం నాకు లేదు. ఈ అధికారం కేవలం పరమేశ్వరునికి మాత్రమే ఉన్నద’ని చెప్పి పరమశివుణ్ని స్మరించాడు. దాంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నారాయణుడికి, వశిష్ఠాది రుషులకు రహస్యజ్ఞాన బోధన చేశారు. ఈ బోధననే ‘ఈశ్వరగీత’ అంటారు. భగవద్గీత మాదిరిగానే ఇందులో అనంతమైన ధర్మసూక్ష్మాలు ఉన్నాయి. లౌకిక జీవనంలోని వివిధ అంశాలతో పాటు, నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి. ధర్మం, అధర్మం, సన్యాసం, త్యాగం, భక్తి, జీవాత్మ, పరమాత్మ, మోక్షం, జ్ఞానం, కర్తవ్యంవంటి అంశాలను లోతుగా అర్థం చేసుకోవటానికి ఇది దోహదం చేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధ ఏ రీతిన సాగుతుందో.. ఈశ్వరగీతలో శివ బోధన అలా సాగుతుంది. ‘ఈశ్వరగీత’లో మోక్షసాధనకు భక్తి ఒక ముఖ్యమైన మార్గంగా పేర్కొన్నాడు శివుడు. భక్తిని ప్రేమ అని చెప్పుకొస్తాడు. ఒక వ్యక్తి హృదయంలో పరమాత్మ పట్ల ఉండే భక్తి, విశ్వాసం ఇందులోకి వస్తాయి. భక్తిని ఈశ్వరుడు నాలుగు రకాలుగా వివరించాడు.
సాత్విక భక్తి:
ఒక వ్యక్తికి ఉండే సత్వగుణం ఆధారంగా ఉండే భక్తి. ఈ తరహా భక్తి ఉన్న వ్యక్తి పరమాత్మను సత్యం, జ్ఞానం, ఆనందం అని భావిస్తాడు.
రాజస భక్తి:
ఒక వ్యక్తి రజోగుణం ఆధారంగా ఉండే భక్తి. ఇలాంటి భక్తుడు పరమాత్మను కరుణామయుడు, దయాళువు అని భావిస్తాడు.
తామస భక్తి:
ఒక వ్యక్తి తమోగుణం ఆధారంగా కలిగే భక్తి. పరమాత్మను భయంకరమైన వాడు, కోపిష్ఠివాడు అని భావిస్తాడు.
నిర్గుణ భక్తి:
వ్యక్తి గుణగణాలకు సంబంధం లేకుండా కలిగే భక్తి. ఇలాంటి భక్తుడు పరమాత్మను నిర్గుణుడు, నిరాకారుడు అని భావిస్తాడు.
-డాక్టర్ పార్థసారథి చిరువోలు