ఖలీల్‌వాడి/ఆర్మూర్‌టౌన్, అక్టోబర్ 5: రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని, వారి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర పక్కన పెట్టి, ఉన్న ధర ఇవ్వని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు అని మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో మక్కజొన్న పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోగా, పంట కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.ఆర్మూర్ అడ్డా, రైతుల పోరాటాల గడ్డ అని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయని పక్షంలో ఆర్మూర్ గడ్డ నుంచి రైతులతో కలిసి తిరుగుబాటు ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఎర్రజొన్నల విషయంలో రైతులు గతంలో చేపట్టిన విధంగా మరోమారు ఆందోళనలు చేపడతామని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.
కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలువలేదని, ఇప్పటికైనా రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారెంటీల అమలు ఊసెత్తని సీఎం, కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెబుతామన్నారు. రైతు సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు మంచిదికాదని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు.