భద్రాద్రి జిల్లా పత్తి రైతులకు రెండు నెలలుగా కంటి మీద కునుకు ఉండడం లేదు. యూరియా కోసం రెండు నెలలుగా భారీ క్యూ లైన్లలో ఉండిపోయిన రైతున్నను ఇప్పుడు భారీ వర్షాలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పత్తి రైతులు పక్షం రోజుల క్రితం పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరైపోయాయి. ‘పత్తి పంటకు బలం కోసం, అది ఎదిగేందు కోసం రెండు నెలలుగా పోరాడుతున్నా యూరియా దొరకవడంలేదు. ఈలోపు కొద్దోగొప్పో విచ్చిన పత్తిని పది రోజుల్లో తీద్దాం’ అనుకున్నారు జిల్లా రైతులు.
కానీ ఆ రోజు రాత్రి కురిసిన భారీ వర్షం పత్తి పంటను ముంచెత్తింది. అది తెచ్చిన భారీ వరదతో ఆ పంట మొత్తానికి కొట్టుకుపోయింది. గోదావరి పరీవాహకంలోని పత్తి చేలైతే.. వేళ్లతో సహా కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల వరదలోనే రోజుల తరబడి ఉండిపోవడంతో కాత, పూత మగ్గిపోయాయి. తాజాగా వాతావరణ శాఖ నుంచి మరోసారి భారీ వర్ష సూచన రావడంతో పత్తి రైతుల్లో మళ్లీ గుబులు మొదలైంది. మరోవైపు వరి, మర్చి రైతులు కూడా ఈ వర్షాలు, వరదలతో భారీగా నష్టపోయారు.
-భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)
పంట పండితేనే రైతన్నలు ఆనందంగా ఉంటారు. చినుకుపడే లోపే విత్తనాలు విత్తినా.. సరైన సమయానికి యూరియా సమస్య వెంటాడింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఎన్నడూ లేని విధంగా యూరియా సమస్య రైతులను పట్టి పీడించింది. వరి పంటకు, పత్తి చేలకు యూరియా వేసేసమయంలో రైతన్నల కంటికి మీద కునుకు లేకుండా చేయడంతో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా రైతులు సొసైటీ గోదాముల వద్ద భారీగా క్యూలు కట్టి పడిగాపులు కాశారు.
చివరికి యూరియా అందకుండానే పోయింది. మరోవైపు కాలం గడిచిపోయినా వానలు వరదలు ముంచెత్తడంతో పంటలు పూత, కాత దశలోనే మగ్గిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది ఆశించిన దిగుబడి రాదనే భయం రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నాలుగుసార్లు భారీ వర్షాలు కురియడంతో రెండు నెలలపాటు సాధారణాన్ని మించి వానలు కురిశాయి. దీంతో పంటలపై వానల ప్రభావం భారీగానే పడింది.
యూరియా లోటు.. వానలు చేటు..
వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. చివరికి తగినంత యూరియా దొరకలేదు. ఎన్ని పాట్లు పడినా పంటలకు యూరియా చల్లుకోలేకపోయారు. అటు పత్తి చేలకు కూడా యూరియా అవసరం ఉండడంతో పత్తి చేలకు యూరియా కొరత తప్పలేదు. దీంతోపాటు భారీ వర్షాలు రైతులను మరింత కుంగదీశాయి. భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో రెండు నెలలుగా భారీ వర్షాలు, గోదావరి వరదలు పంటలను నీట ముంచే ఉంచాయి. దీంతో ఆ చేలన్నీ మురిగిపోయాయి.
సాధారణాన్ని మించిన వానలు..
భద్రాద్రి జిల్లా రైతులను నట్టేట ముంచేలా వానలు కురిశాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. పత్తి చేను మాత్రం పిందె దశలో రంగు మారే పరిస్థితి వచ్చింది. దీంతో పత్తి చేలు కొన్ని చోట్ల ఎదుగులేదు. మరికొన్ని చోట్ల కాయలు రంగు మారాయి. కొన్ని ఏరియాల్లో భారీ వర్షాలకు పత్తి చెట్లు కొట్టుకుపోయాయి. చివరికి మిర్చి మొక్కలు కూడా మునిగిపోయాయి. ఈ ఏడాది రైతులు పత్తి మీద ఆశలు పెట్టుకుని 2,20,842 ఎకరాల్లో ఆ పంటను సాగు చేశారు. తొలుత మొఖం చాటేసిన వర్షాలు.. ఆ తరువాత అధికంగా కురిశాయి. ఆగస్టులో 201 మిల్లీమీటర్ల వాన కురవాల్సి ఉండగా 328 మిల్లీమీటర్ల వాన కురిసింది. సెప్టెంబర్లో 296 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 376 మిల్లీమీటర్ల వానపడింది. దీంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి.
యూరియా కోసం తిరిగి పంటలు కోల్పోయాం..
రెండు నెలలపాటు యూరియా కోసం తిరిగి పంటలను కోల్పోయాం. యూరియా వేస్తేనే పంట ఏపుగా పెరిగి దిగబుడి మంచిగా వస్తుంది. కానీ, ఈ కాంగ్రెస్ పాలనలో సకాలంలో యూరియా దొరకలేదు. దానికోసం గోదాముల వద్ద పడిగాపులు కాశాం. అయినా దొరకలేదు. ఫలితంగా, పంటలు ఎదగలేదు. ఇప్పుడు దిగుబడి తగ్గే ప్రమాదముంది.
-వేల్పుల చినవీరయ్య, తిప్పనపల్లి, చుండ్రుగొండ
పత్తి చేను ఎర్ర బారింది.
వానలు ఎప్పడు వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఉన్నట్లుండి భారీ వానలు కురవడంతో చేతికొచ్చిన పంటలు మొత్తం నాశనమయ్యాయి. ఒక్క మొక్క కూడా బతికే పరిస్థితి లేదు. మా ఊరిలో పది రోజులైతే పత్తి తీయాలనుకున్నాం. కానీ మొక్కలు కూడా కొట్టుకు పోయాయి. చేను ఎర్రబారి పోయింది.
-లావుడ్యా విజయ, భోజ్యాతండా, జూలూరుపాడు
పత్తికి బాగా నష్టం జరిగింది..
మా మండలంలో 100 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి పంటలు మొత్తం నేలమట్టమయ్యాయి. అప్పుడు సమయానికి యూరియా దొరకక పత్తి కాయలు ఎరుపు రంగులోకి మారాయి. ఇప్పుడు వాన వచ్చి ఛిద్రం చేసింది. మిర్చి చేను కూడా కొట్టుకుపోయింది. ఒక్క అధికారి కూడా వచ్చి చూసి వెళ్లిన పాపాన పోలేదు.
-జాటోత్ బాలు, భోజ్యాతండా, జూలూరుపాడు