నిజామాబాద్, అక్టోబర్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నాగిరెడ్డిపేట: ఎల్లారెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మొదటగా నాగిరెడ్డిపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ఉధృతికి కొట్టుకు పోయిన పంట పొలాలను, తెగిన రోడ్లను, పంట నష్టం సంభవించిన రైతులతో నేరుగా ముచ్చటించారు. రైతుల దీనగాథలను విని చలించి పోయా రు. బాధితుల పక్షాన పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ ముందుంటుందని చెప్పారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. కామారెడ్డి జిల్లాలో వరదతో దాదాపుగా వేలాది ఎకరాలు పంట నష్టం జరిగిందని, వందలాది ఇండ్లు కూలిపోయాయని, ప్రాణ, ఆస్తి నష్టం జరిగితే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రివ్యూ చేసి అందరినీ ఆదుకుంటామని చెప్పి, నయా పైసా సాయం చేయలేదని చెప్పారు.
జిల్లా అధికారులు పంపిన నివేదికలు రూ.344 కోట్లు నష్టం వాటిల్లిందని చెబితే 34 రూపాయలు జిల్లాకు విడుదల కాలేదన్నారు. రోడ్లు తెగిపోయినాయి, విద్యుత్ వ్యవస్త నిలిచి పో యింది. పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టలేదంటూ మండిపడ్డారు. తెగిపోయిన బ్రిడ్జి చూసి పోయారు. నెల రోజులైనా బాగు చేయలేదన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కనీసం కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆర్టీసీ బస్సులు నడవడం లేదన్నారు. కామారెడ్డికి రవాణా సౌకర్యం దెబ్బతిన్నదని చెప్పా రు.
15 రోజుల్లో హైదరాబాద్లో రివ్యూ పెడుతానని చెప్పి 15 రోజులు కాదు కదా నెల రోజులైనా పట్టించుకున్నదేమీ లేదని విమర్శించారు. రైతుల కు పైసా సాయం చేయలేదని, మాటలకు ఎక్కు వ. చేతలకు తక్కువ అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు ఉన్నదన్నారు. జిల్లాలో 40వేల ఎకరాల్లో పంట నష్టం, ఇసుక మేటలు కూరుకుపోతే వేలాది ఇండ్లు కూలిపోయాయన్నారు. తక్షణం సాయం చేస్తానని చెప్పి మానవత్వం లేకుండా సీఎం ప్రవర్తిస్తున్నారన్నా రు. వరదలో మునిగి నెలలు గడుస్తున్నప్పటికీ పైసా సాయం ఇవ్వకపోవడం హేయమైన చర్యఅన్నారు.