– ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణలో మార్పు ఖాయం
– అర్హతగల ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి
– అవగాహన సదస్సులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల
ఖమ్మం రూరల్, అక్టోబర్ 05 : జెన్ జీల నుండి వృద్ధులు, మహిళలు సమాజంలో సబ్బండ వర్గాలు గులాబీ జెండాకు జై కొడుతున్నాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి గణేష్ నగర్ లో ఉన్నటువంటి కందాల క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మూడేళ్లలోనే కాంగ్రెస్ పాలన ముగింపు దశకు చేరుకుందన్నారు. సమాజంలో ఏ ఒక్క వర్గం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిగా లేదన్నారు. ఎన్నికలలో గెలిచేందుకు అలివి కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అనతి కాలంలోనే ప్రజల వ్యతిరేకతను మూటకట్టుకున్నదన్నారు.
తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలతోనే మార్పు రాబోతుందని స్పష్టం చేశారు. ఈ నెల 25 లోపు అర్హత గల పట్టభద్రులందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా పార్టీ శ్రేణులు కసరత్తులు చేయాలన్నారు. స్వయంగా ప్రతి గ్రాడ్యుయేట్ ను కలిసి దరఖాస్తు ఫారం నింపించి, స్వయంగా ఆన్లైన్ చేయించాలని దిశా నిర్దేశం చేశారు. ఆరు నూరైనా నూరు ఆరైనా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. యువకులు విద్యావంతులు, ఉద్యోగులు ఈ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రికార్డు విజయం సొంతం చేసుకోబోతున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఇతర నాయకులు, పాల్గొన్నారు.

‘గులాబీ జెండాకి సబ్బండ వర్గాలు జై’