మంథని, నవంబర్ 4: మంథని గోదావరి తీరంలో గల్లంతైన యువకుడి మృతదేహం జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారం బ్యారేజీలో లభ్యమైంది. మంథనికి చెందిన రావికంటి సాయికృష్ణ(30) అనే యువకుడు సాఫ్ట్వేటర్ జాబ్‌ను గత రెండు సంవత్సరాల క్రితం వదిలి పెట్టి వీడియోలపై ఉన్న మక్కువతో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తూ మంథని ప్రాముఖ్యతలతో పాటు ఇక్కడ ఉన్న విశేషాలను, వివిధ ఆంశాలను చిత్రీకరిస్తూ ఉండేవాడు. అదే విధంగా ప్రతి రోజు గంగకు స్నానానికి సైతం వెళ్లే వాడు. ఈ క్రమంలో సోమవారం సైతం ఉదయం గోదావరి నదికి స్నానానికి వెళ్లాడు. గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాయికృష్ణ గోదావరిలో గల్లంతైన విషయం విధితమే.
సాయికృష్ణ ఆచూకీ కోసం గోదావరి నదిలో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మృతదేహం గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజీలోకి చేరింది. అన్నారం బ్యారేజీలో గుర్తు తెలియని మృతదేహం ఉందని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంథని ఎస్ఐ-2 సాగర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అన్నారం బ్యారేజీలో మళ్లీ గాలింపు చర్యలు చేపట్టడంతో మృతదేహం లభ్యం కాగా సాయికృష్ణ బంధువులు అది సాయికృష్ణ మృతదేహంగా ధృవీకరించారు. సాయికృష్ణ తండ్రి చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.