కోల్ సిటీ, నవంబర్ 4: ఇటీవల కాలంగా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డా.హర్షిత్ అన్నారు. ఈ మేరకు గోదావరిఖని పాత సీఎస్పీ కాలనీలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. డా. హర్షిత్ హాజరై కాలనీలోని సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు ఇతరులు సుమారు 200 మందికి ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ , 2డీ ఏకో తదితర వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన పలు సూచనలు చేశారు.
గతంలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చిన విధంగా ఇటీవల కాలంగా బ్రెయిన్ స్ట్రోక్ ప్రబలుతుందని, గుండెకు స్టంట్ వేసిన మాదిరిగానే మెదడుకు స్టంట్ వేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన నాలుగు గంటల వ్యవధిలో హాస్పిటల్కు తీసుకువస్తే మందులతో నయం చేయవచ్చని తెలిపారు. ప్రజలు నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో దిహంగ సింగ్, అనిల్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బోంగోని హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.