ఓదెల, నవంబర్ 4 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ని అభివృద్ధి పరచాలని కోరుతూ మంగళవారం ఓదెలకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్‌కు గ్రామస్తులు విన్నవించారు. పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే సెక్షన్లో పలు తనిఖీలకు డీఆర్ఎం మంగళవారం ఉదయం వెళుతుండగా..ఓదెల రైల్వే స్టేషన్లో ఆగి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డీఆర్ఎమ్ కు ఓదెల మల్లికార్జున స్వామి ప్రతిమను అందజేశారు. ఇక్కడ స్టేషన్లో కనీస సౌకర్యాలు కల్పించాలని షెడ్లు, మరుగుదొడ్లు, లైటింగ్, కూర్చుండడానికి బల్లలు, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం ఇక్కడ ఉన్నందున ఇక్కడి స్టేషన్లో కరీంనగర్ తిరుపతి, దానాపూర్, అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకుడు అల్లంకి శేషుమూర్తి, ప్రైవేటు వైద్యుల సంఘం నాయకుడు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, ముంజల మధు గౌడ్, సదాశయ ఫౌండేషన్ నాయకుడు మెరుగు సారంగం, కుమార్, రాకేష్, రాజేంద్రప్రసాద్, అశోక్, కృష్ణమాచారి, సాయి తదితరులు పాల్గొన్నారు.