వినాయక్ నగర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువతిని వేధింపులకు గురిచేసిన డెంటల్ డాక్టర్( Dental Doctor) , రియల్ ఎస్టేట్ వ్యాపారి( Real estate businessman) పై పోలీసులు నిర్భయ కేసు ( Nirbhaya case) నమోదు చేశారు. బాధితురాలు ప్రజావాణిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ( CP Sai Chaitanya ) ను కలిసి గోడును వెల్లిబుచ్చుకుని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ యువతి 2021 సంవత్సరంలో ప్రగతినగర్‌లోని ఓ ట్రావెల్స్ ఏజెన్సీలో పనికి చేరింది. ఆమె పనిలో ఉన్న సమయంలో ఓ డెంటల్ డాక్టర్ విదేశాలకు వెళ్లేందుకు తనకు పాస్ పోర్ట్ కావాలంటూ ట్రావెల్స్ ఏజెన్సీకి వచ్చి సదరు యువతి సెల్‌ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అనంతరం ఆ యువతి పలుసార్లు ఫోన్ చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ తాము చెప్పిన చోటుకు వస్తే కావాల్సింనంత డబ్బులు ఇస్తామని వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
నగరానికి చెందిన ఆయిల్ గంగాధర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సైతం ఇదే రకంగా వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. 2023లో ఆమె పనిచేసే ట్రావెల్స్ ఏజెన్సీ నుంచి ఉద్యోగం మానేసి , వివాహం చేసుకొని ఉంటుంది. అయితే వీరిద్దరి నుంచి వేధింపులు మితిమీరిపోవడంతో సోమవారం బాధిత యువతి నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ బాధితురాలి పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించాల్సిందిగా సంబంధిత నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్‌ను ఆదేశించారు. దీంతో మంగళవారం డెంటల్ డాక్టర్ అమర్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్‌పై నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.