Chakda Xpress | భారత మహిళా జట్టు తొలిసారిగా 2025 వన్డే వరల్డ్ కప్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళా క్రికెట్‌కి ఇది కొత్త యుగానికి నాంది అని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ విజయంతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికర ట్రెండ్ మొదలైంది. క్రికెట్ అభిమానులు, సినిమా ప్రేమికులు కలిసి ఒకే స్వరంలో ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ సినిమాను విడుదల చేయాలని కోరుతున్నారు.మాజీ భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్‌లో అనుష్క శర్మ ప్రధాన పాత్ర పోషించారు.
విరాట్ కోహ్లీ భార్యగా, స్టార్ హీరోయిన్గా పేరుగాంచిన అనుష్క ఈ చిత్రంతో సినిమాకు కంబ్యాక్ ఇవ్వనున్నారు. ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్ విడుదలైనప్పుడే భారీగా వైరల్ అయింది. కానీ సినిమా అనౌన్స్ చేసి మూడు సంవత్సరాలు అయింది. షూటింగ్ పూర్తి చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇప్పుడు మహిళా జట్టు వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో “ఇదే సరైన సమయం… ఇప్పుడైనా సినిమా రిలీజ్ చేయాలి” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి సీనియర్ ఆటగాళ్లు దేశానికి వరల్డ్ కప్ తేవాలని ఏళ్ల తరబడి పోరాడిన విషయం తెలిసిందే. ఈ విజయంతో వారిద్దరూ భావోద్వేగానికి గురై, ట్రోఫీని చూసి ఆనందంతో కంటతడి పెట్టారు.
అందుకే “జులన్ గోస్వామి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా ఇప్పుడు విడుదలైతే, అది కేవలం సినిమా కాదు, మహిళా క్రికెట్ విజయానికి అద్దం పట్టే ఘటన అవుతుంది” అని అభిమానులు అంటున్నారు. ఇప్పుడేమో అభిమానుల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అనుష్క శర్మ, నెట్‌ఫ్లిక్స్ (ఈ సినిమా విడుదల హక్కులు కలిగి ఉన్న సంస్థ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి, జులన్ గోస్వామి నిజ జీవిత గెలుపుతో ముడిపడిన ఈ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ ఎప్పుడు తెరపైకి వస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.