టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వారసుడు ఎవరన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. కొత్త సుప్రీం లీడర్ ఎంపికను దాదాపు ఖరారు చేసిన ఇరాన్.. ఆయన పేరును మాత్రం బహిర్గతం చేయలేదు. అయితే ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీనే ఆ పదవికి ఎన్నుకునే అవకాశముందని ప్రచారం జరుగుతున్నది. ఆయన పేరును ప్రకటించగానే ఇజ్రాయెల్ అతడిని లక్ష్యంగా చేసుకుని హతమారుస్తుందన్న భయం ఆ దేశంలో నెలకొని ఉంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం వారసుడిని ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌పై ఉంది. ఇందులో 88 మంది మత పండితులు ఉంటారు. అయితే ఇందులో కొందరు సభ్యులు వారసత్వ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. కాగా ఖమేనీ వారసుడి ఎంపిక పూర్తయిందని, అయితే అధికారికంగా ప్రకటించడానికి కొన్ని నిర్వహణాపరమైన అడ్డంకులు మిగిలాయని అసెంబ్లీ సభ్యుడు అయతొల్లా మహమ్మదీ మిర్బాఖేరి ఆదివారం తెలిపారు. వారసుని ఎంపిక విషయంలో అభ్యర్థి ఎంపిక ప్రక్రియను మెజారిటీ వర్గం ఇంచుమించు పూర్తి చేసిందని చెప్పారు. అయితే తుది నిర్ణయం ప్రకటించడానికి స్వల్ప ఇబ్బందులు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించి వారసుడిని ప్రకటిస్తారన్నారు. .
‘ట్రంప్‌ను వదిలిపెట్టం!’
తమ నాయకుడు ఖమేనీ చిందించిన రక్తానికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రక్షణ చీఫ్ అలీ లరిజాని ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ చీఫ్‌ను హతమార్చినందుకు తగిన మూల్యం తప్పక చెల్లిస్తారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు. లరిజాని హెచ్చరికలపై వెంటనే స్పందించిన ట్రంప్ అతని మాటలను తాను లెక్కచేయనని అన్నారు. దివంగత ఖమేనీకి సలహాదారుగా వ్యవహరించిన లరిజాని శనివారం మాట్లాడుతూ ట్రంప్‌ను ఒంటరిగా వదలమని అన్నారు. ఇరాన్ శక్తిని ట్రంప్ చాలా తక్కువగా అంచనా వేశారని, ఈ సంక్షోభం అంత త్వరగా అంతం కాబోదని పేర్కొన్నారు. ‘మా నేత చిందించిన రక్తానికి మా ప్రజలు దీటుగా ప్రతీకారం తీర్చుకుంటారు. ట్రంప్ మూల్యం చెల్లిస్తారు.. చెల్లించబోతున్నారు’ అని ఆయన అన్నారు.