సూర్యాపేట టౌన్, అక్టోబర్ 24 : రక్త దానం చేయడం అంటే ప్రాణ దానం చేయడం లాంటిదని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ అమరవీరుల త్యాగాల స్మారకంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల త్యాగాలు, బలిదానాలను ప్రజలు గుర్తించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు అత్యవసర సమయంలో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి పరిస్థితి రాకుండా అవసరమైన వారికి సరైన సమయంలో రక్తం అందాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెద్ద ఎత్తున యువత తరలివచ్చి రక్తదానం చేయడం సంతోషకరమైన విషయమన్నారు.
ఖమ్మంకు చెందిన సికి సెల్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లల కోసం రక్తాన్ని సేకరించారు. ఎస్పీ నరసింహతో పాటు ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ఆర్ఎస్ఐలు కె.అశోక్, రాజశేఖర్, స్పెషల్ పార్టీ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ కలిపి మొత్తం 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ వి.ప్రసన్న కుమార్, పోలీస్ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఆర్ఎస్ఐలు సురేశ్, సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు.