Milk Varieties | పాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. ఎందుకంటే పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అనేక పోషకాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఈ క్రమంలోనే మనం పాలతో రోజూ టీ, కాఫీ, పెరుగు, నెయ్యి వంటివి చేసి తీసుకుంటాం. అయితే నగరాలు, పట్టణాల్లో ఉండే చాలా మంది పాల ప్యాకెట్లనే ఎక్కువగా వాడుతుంటారు. ఈ క్రమంలో పాల ప్యాకెట్ల విషయానికి వస్తే అనేక రకాల పేర్లు మనకు వినిపిస్తుంటాయి. స్కిమ్డ్ మిల్క్, టోన్డ్ మిల్డ్, హోల్ మిల్క్.. ఇలా పలు రకాల వెరైటీల్లో మనకు పాలు ప్యాకెట్లలో లభిస్తున్నాయి. అయితే అసలు ఈ పాల మధ్య తేడాలేమిటి..? ఏ పాలను మనం తాగాల్సి ఉంటుంది..? ఏ పాలలో పోషకాలు ఎలా ఉంటాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాల ప్యాకెట్లలో మనకు హోల్ మిల్క్ లభిస్తుంది. దీన్నే ఫుల్ క్రీమ్ మిల్క్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ పాలలో కొవ్వు శాతం 3.5 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుందన్నమాట. సాధారణంగా డెయిరీ నిర్వాహకులు పాలను సేకరించిన తరువాత వాటిని ప్రాసెస్ చేస్తారు. అనంతరం ప్యాకెట్లలో నింపుతారు. ఈ క్రమంలో వాటిలో ఉన్న కొవ్వును తొలగించకుండా అలాగే ఉంచుతారు. అనంతరం ఆ పాలను ప్యాక్ చేసి విక్రయిస్తారు. ఈ పాలనే ఫుల్ క్రీమ్ మిల్క్ లేదా హోల్ మిల్క్ అని పిలుస్తారు. ఈ పాలు రుచిగా ఉంటాయి. క్యాలరీలు అధికంగా లభిస్తాయి. 2 ఏళ్ల వయస్సుకు పైబడిన వారు, టీనేజ్లో ఉన్నవారు, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు ఈ పాలను తాగితే మేలు జరుగుతుంది. పోషకాలను, కొవ్వులను అధిక మొత్తంలో పొందవచ్చు. కొవ్వులతోపాటు విటమిన్లు ఎ, డి కూడా లభిస్తాయి.
ఇక పాల ప్యాకెట్లలోనే మనకు లభించే మరో రకం ప్యాకెట్లు.. టోన్డ్ మిల్క్ రూపంలో ఉంటాయి. ఈ పాలలో కొవ్వు 3 శాతం కన్నా తక్కువగా ఉంటుంది. పాలను ప్యాక్ చేసే సమయంలో అందులో ఉన్న కొవ్వును కొంత మేర తొలగిస్తారు. దీంతో సహజసిద్ధమైన పాల కన్నా ఇందులో కొవ్వు శాతం కాస్త తక్కువగా ఉంటుంది. అలాగే ఈ పాలు అందించే క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ పాలను మనం రోజువారి అవసరాలకు ఉపయోగించవచ్చు. ఇక డబుల్ టోన్డ్ మిల్క్ అంటే పాలలో కొవ్వు 1.5 శాతం కన్నా తక్కువగా ఉంటుంది. పాలను ప్రాసెస్ చేసే సమయంలో అందులో ఉన్న కొవ్వును చాలా వరకు తగ్గిస్తారు. టోన్డ్ పాల కన్నా డబుల్ టోన్డ్ పాలలో కొవ్వు సగానికి సగం వరకు తగ్గుతుంది. ఈ పాలను పెద్దలు, అధికంగా బరువు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు తాగవచ్చు. వీటి వల్ల కొవ్వు చాలా స్వల్ప మొత్తంలో లభిస్తుంది. కానీ ఇతర పోషకాలను మాత్రం పొందవచ్చు. పాలలో ఉండే కొవ్వు అవసరం లేదు, ఇతర పోషకాలు మాత్రమే కావాలని అనుకునే వారు ఈ పాలను ఉపయోగించవచ్చు.
ఇక మార్కెట్లో మనకు స్కిమ్డ్ మిల్క్ అని మరో రకం పాలు కూడా లభిస్తాయి. ఈ పాలలో కొవ్వు 0.1 శాతం లేదా అంతకన్నా తక్కువగా ఉంటుంది. కొన్ని కంపెనీలు స్కిమ్డ్ పాలను అసలు కొవ్వు లేకుండా కూడా తయారు చేసి అందిస్తున్నాయి. వాటిని ఫ్యాట్ ఫ్రీ మిల్క్ గా వ్యవహరిస్తున్నారు. ఈ పాలను తాగడం వల్ల చాలా స్వల్ప మొత్తంలో క్యాలరీలు లభిస్తాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పాలు అత్యుత్తమ ఆహారంగా చెప్పవచ్చు. అలాగే ఈ పాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. రుచిగా కూడా ఉంటాయి. ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్ ఎ, డి వంటి పోషకాలను సైతం పొందవచ్చు. ఇలా ఆయా రకాల పాలను ఎవరైనా తమ అవసరానికి తగినట్లు వాడుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.