భువనగిరి కలెక్టరేట్, మార్చి 14 : బీఆర్ఎస్ జమ్మాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు మాదాను మొహిజ్పై అదే గ్రామానికి చెందిన సర్పంచ్ లూర్ధయ్య దాడి చేసి గాయపరిచిన సంఘటన కలకలం రేపింది. ఈ దాడిలో మాదాను మొహిజ్ తలకు గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గ్రామస్తులు, బాధితుడి కథనం ప్రకారం ఓ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో సర్పంచ్ లూర్ధయ్య, మాదాను మొహిజ్ పై దాడి చేసి గాయపరిచాడు. దీంతో మొహిజ్ తలకు గాయం కావడంతో దవాఖానకు తరలించినట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్ వీధి రౌడీలా ప్రవర్తిస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై బాధితులు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ లూర్ధయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. గాయపడిన మొహిజ్ను పార్టీ మండల అధ్యక్షుడు జనగాం పాండు, మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్, సిలివేరు మధు తదితరులు పరామర్శించారు.