దేవరకొండ రూరల్, అక్టోబర్ 23 : అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని దేవరకొండ పోలీసులు గురువారం పట్టుకున్నారు. దేవరకొండ ఎస్ఐ పి.వెంకట్ రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం.. దేవరకొండ శివారులో పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామం నుండి దేవరకొండ వైపు వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. దీంతో 50 బస్తాల్లో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ తరలింపు బహిర్గతమైనట్లు తెలిపారు. వాహన డ్రైవర్ను ప్రశ్నించగా నసర్లపల్లి గ్రామానికి చెందిన షేక్ మురియాబి ప్రజల వద్ద రేషన్ బియ్యంను తక్కువ ధరకు కొని నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలోని నాయిని సంపదయ్యకు అమ్ముతున్నట్లు తెలిపాడు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.