నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పశు వైద్య సిబ్బంది (Veterinary staff ) పనితీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణను సక్రమంగా చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండవలసిన పశు వైద్య సిబ్బంది మధ్యాహ్నం అయిందంటే చాలు ఆసుపత్రికి తాళం వేసి వెళ్లిపోతున్నారు.
దీంతో తమ పశువులకు వైద్యం కోసం వస్తే దవఖానకు తాళం వేసి ఉండడంతో వెనుతిరిగి నిరాశగా వెను తిరుగుతున్నారు. సిబ్బందిని అడిగేవారు లేక సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పశు వైద్య శాఖ జిల్లా అధికారులు స్పందించి పశు వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని పశుపోషకులు కోరుతున్నారు. వెటర్నరీ అసిస్టెంట్‌ను ఫోన్లో వివరణ కోరగా ఇతర గ్రామంలో పశువులకు గాలికుంటు టీకా వేయడానికి వెళ్లినట్లు సమాదానం ఇచ్చారు.