నిడమనూరు, సెప్టెంబర్ 26 : బైక్ దొంగతనం కేసులో దోషికి రెండు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి టి. స్వప్న శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు లైజన్ అధికారి షేక్ అలీ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా బోయినపల్లికి చెందిన గన్నేరు రాజశేఖర్ 2024, జనవరి 10న ఉదయం హాలియాకు సొంత పని మీద బైక్పై వచ్చాడు. వాహనాన్ని బస్టాండ్ లో ఉంచి బయటకు వెళ్లి తిరిగి 11 గంటలకు వచ్చి చూసేసరికి కనిపించలేదు. వాహనం కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్ఐ శోభన్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తులో పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండాకు చెందిన రమావత్ రవి వాహనాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. ఈ మేరకు రవిపై కోర్టుకు అభియోగ పత్రాన్ని సమర్పించారు. బైక్ అపహరించినట్లుగా తేలడంతో రెండు నెలల సాధారణ జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కు కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ సహకరించారు.