Tejashwi Yadav : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తర్వాత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ (JDU) పార్టీకి భవిష్యత్తే లేదని ఆర్జేడీ (RJD) అగ్రనేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) అన్నారు. ఆ పార్టీలో బీజేపీ ఐడియాలజీతో ఉన్నవాళ్లు బీజేపీలోకి వెళ్తారని, సామాజిక న్యాయం, లౌకికవాదాన్ని విశ్వసించేవారు ఆర్జేడీలోకి వస్తారని వ్యాఖ్యానించారు.
‘బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జేడీయూ పార్టీ ఉండదు. ఎందుకంటే ఆ పార్టీలో బీజేపీ ఐడియాలజీతో ఉన్నవాళ్లు బీజేపీలోకి వెళ్తారు. ఇక సామాజిక న్యాయం, లౌకికవాదాన్ని విశ్వసించే వారు మా పార్టీలోకి వస్తారు’ అని వ్యాఖ్యానించారు. జేడీయూ మాజీ ఎమ్మెల్యే రేణూదేవి కుశ్వాహ ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి, ఆర్జేడీలో చేరారు.
ఆర్జేడీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన తేజస్వియాదవ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తేజస్వియాదవ్ మాట్లాడుతూ.. జేడీయూపై, నితీశ్ కుమార్‌పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. పార్టీ క్యాడర్ కూడా నితీశ్ విధానాలతో అసంతృప్తిగా ఉందని తెలిపారు. అందుకే ఆ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని చెప్పారు.