బీబీనగర్, సెప్టెంబర్ 26 : స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ మహిళల పాలిట గొప్ప వరమని బీబీనగర్ ఎయిమ్స్ బోర్డు మెంబర్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే.అరుణ అన్నారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఆలోచించి ఇంత గొప్ప ప్రోగ్రామ్ మొదలు పెట్టారన్నారు. ఈ నెల 17 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు మహిళల ఆరోగ్యం కోసం స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ కొనసాగనున్నట్లు తెలిపారు. మహిళల్లోని అనేక రుగ్మతలకు తెలుసుకునేలా ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. 40 ఏండ్లు దాటిన ప్రతి మహిళ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఇప్పటి వరకు 9,400 మందికి టెస్టులు చేసినట్లు వెల్లడించారు. నిరుపేదలందరికీ ఉచితంగా, తక్కువ ఖర్చుతో చికిత్స అందించడమే ఎయిమ్స్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
అనంతరం ఎయిమ్స్ బోర్డు మెంబర్‌గా నియమితులైన ఎంపీ డీకే.అరుణ శుక్రవారం తొలి సమావేశం నిర్వహించారు. ఎయిమ్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహెంతం శాంతాసింగ్, డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీన్, ఇతర ఎయిమ్స్ అధికారులతో సమావేశమై ఎయిమ్స్ నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలు, నిర్మాణ దశలో ఉన్న భవనాలు తదితర అంశాలపై ఆమె చర్చించారు. ఆస్పత్రిలో కొనసాగుతున్న వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ టెస్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట నాయకులు ఉట్కూరి అశోక్‌గౌడ్, వేముల అశోక్, జగన్మోహన్రెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లేషం, రవీందర్, నరోత్తమ్‌రెడ్డి, ప్రభాకర్, మహేందర్, సదానందం గౌడ్ పాల్గొన్నారు.
Bibinagar : ‘స్వస్త్ నారీ, సశక్త్ పరివార్’ మహిళల పాలిట గొప్పవరం : ఎంపీ డీకే అరుణ