హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను మురికికూపంగా మార్చారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. నగరంలో ఎటూ చూసినా చెత్త, చెదారం పేరుకుపోయిందని దుయ్యబట్టారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతున్నామనే భయం సీఎం రేవంత్‌రెడ్డికి పట్టుకున్నదని, ఆ ఒత్తిడితోనే జూబ్లీహిల్స్ ఓటర్లను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఉప ఎన్నికలో వారం రోజులపాటు ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవని, ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. బోరబండలో కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక సర్దార్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారని బాల్క సుమన్ ఆవేదన వ్యక్తంచేశారు. వ్యాపారాలున్న బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని మరీ బెదిరింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ అక్కడి ఓటర్లను బెదిరిస్తున్నారని, సీఎం రేవంత్ ప్రవర్తననే నవీన్‌యాదవ్ అనుసరిస్తున్నారని విమర్శించారు. నేర చరిత్ర ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఎన్నికల సంఘం ఎలా అనుమతించిందని ప్రశ్నించారు.
బీహార్ ఎన్నికలో పంచగా మిగిలిన 30 వేల కుక్కర్లను, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పంచాలని బాంబుల మంత్రి ప్రయత్నిస్తున్నారని, దీనిపై ప్రజలు, మీడియా దృష్టి సారించాలని బాల్కసుమన్ పేర్కొన్నారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చివరకు డీసీపీ మీద కూడా దాడి చేసే పరిస్థితి హైదరాబాద్‌లో రావడం దురదృష్టకరమని చెప్పారు. సమావేవంలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్, బీఆర్ఎస్ నాయకులు చాడ కిషన్‌రెడ్డి, ఆజం అలీ, ముఖీద్ చాందా, ముసిముల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.