కథాంశాల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, వినోదాత్మక చిత్రాలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది ‘సింగిల్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. బుధవారం ఆయన కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైనర్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తారు. ‘ప్రతి యువకుడి కథ’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన పోస్టర్ సినిమా కథను ప్రతిబింబిస్తున్నది.
‘ఓటీటీ చిత్రం ‘అనగనగా’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సన్నీ సంజయ్ ఈ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారు. మన రోజువారి జీవితంలోని సంఘర్షణ, ఆశలు, ఆకాంక్షలలకు దృశ్యరూపంలా సున్నితమైన భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. వినోదానికి కూడా పెద్దపీట వేస్తున్నాం. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, రచన-దర్శకత్వం: సన్నీ సంజయ్.