హైదరాబాద్, నవంబర్5 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి రాష్ట్ర ప్రయోజనాలతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భవిష్యత్తును బలిపెడుతున్నదని ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతున్నది. సీఎంకు బీజేపీతో, ప్రధాని మోదీతో స్నేహం ఉన్నదని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నది. దీనికితోడు అదానీతో ఒప్పందాలు మొదలు రాష్ట్రంలో బుల్డోజర్ పాలన వరకు ప్రతీది కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా అడుగులు వేస్తుండటంతో అధికార పార్టీ నేతలు కక్కలేక, మింగలేక ఇబ్బందులు పడుతున్నట్టు చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు మోదీని ‘బడేభాయ్’ అని పిలవడంతో అనుమానం మొదలైందని, ఈ ఏడాది మార్చిలో మంత్రి శ్రీధర్‌బాబును బయటకు పంపి మరీ ప్రధాని మోదీతో రేవంత్‌రెడ్డి రహస్య మంతనాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచే రేవంత్ మనవాడు కాదని రాహుల్ సన్నిహితులు ఏఐసీసీకి తేల్చి చెప్పినట్టు కాంగ్రెస్ నేతలే చెప్పుకుంటున్నారు. నాటి నుంచి ఢిల్లీ దూత మొదలుకొని ప్రతి ఒక్కరూ ఆధారాలను సేకరించి, అధిష్ఠానానికి నివేదికలు అందిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాహుల్‌గాంధీ భవిష్యత్తుకు ప్రతిష్ఠాత్మకంగా భావించిన లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని ‘బడేభాయ్ ’ అని సంబోధించడంపై కాంగ్రెస్ అధిష్టానం ఆశ్చర్యపోయింది. రేవంత్‌రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ అప్పటి నుంచే జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై జాతీయ కాంగ్రెస్ నేతలు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా, రేవంత్‌రెడ్డి మాత్రం ‘ప్రధానిని పెద్దన్న అని అంటే తప్పేమిటి’ అంటూ వితండవాదన చేశారు. అక్కడితో ఆగకుండా తాను మోదీ స్కూల్ నుంచే వచ్చానని, చంద్రబాబు కాలేజీలో చదివి, రాహుల్‌గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నట్టు ఢిల్లీలో ప్రకటించారు. దీంతో రేవంత్ తీరుపై ఆనాడే ఢిల్లీ పెద్దలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు అప్పట్లో లీకులు వచ్చాయి. జాతీయ కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తంచేసినా ఆయన పట్టించుకోలేదని, మోదీ కంటే ఏదీ ఎక్కువ కాదన్నట్టే వ్యవహరిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది.

బీజేపీది ‘బుల్డోజర్ పాలన’ అని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నది. రాహుల్, ప్రియాంక తదితరులు సందర్భం వచ్చినప్పుడల్లా బుల్డోజర్ రాజ్ అంటూ బీజేపీపై మండిపడుతున్నారు. తాజాగా బీహార్ ఎన్నికల్లోనూ బుల్డోజర్ పాలననే కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా వాడుతున్నది. యూపీ ఎన్నికల్లో వాడినంతగా వాడలేకపోతున్నది, దీనికి రేవంతే కారణమని ఇతర రాష్ర్టాల నేతలు అం టున్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో బుల్డోజర్లను పరుగులు పెట్టించడంతో ఇండి కూ టమి ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. రే వంత్ కావాలనే బీజేపీకి హైడ్రా ఆ యుధాన్ని అందించారని ఏఐసీసీ అనుమానిస్తుంది.

సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు 55 సార్లు ఢిల్లీకి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ బీజేపీ మంత్రులను కలిశారు. కనీసం 18 సార్లు ప్రధాని మోదీని కలిశారు. గత రెండేండ్లలో బీజేపీ సీఎంలకు కూడా మోదీ ఇన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. కానీ రేవంత్‌రెడ్డి కోరడమే అలస్యం.. పీఎంవో నుంచి గ్రీన్‌చానల్ ద్వారా అపాయింట్మెంట్ దొరుకుతున్నదని బీజేపీ నేతలే చర్చించుకుంటున్నారు. కేంద్ర మంత్రులతో అయితే ఫోన్‌కాల్స్ మీద అపాయింట్మెంట్ దొరుకుతున్నదని ప్రచారం జరుగుతున్నది. బీజేపీతో రేవంత్‌రెడ్డి రహస్య పొత్తులకు ఈ ఉదాహరణలు చాలవా? అని రాష్ట్రంలోని అసలు కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.

ఆపరేషన్ సిందూర్‌పై బీజేపీ చేసే ప్రచారానికి, కాంగ్రెస్ వైఖరి భిన్నంగా ఉన్నదని అందరికీ తెలిసిందే. ఆపరేషన్ జరిగిన విధానం, కాల్పుల విరమణ తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకత్వం కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. మోదీని రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం నుంచి నెక్లెస్‌రోడ్డు వరకు జరిగిన ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో లోపాలను కాంగ్రెస్ ఎత్తిచూపగా, రేవంత్‌రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ పార్లమెంట్ లోపల, బయట పోరాడుతున్న సంగతి తెలిసిందే. కానీ సీఎం రేవంత్ ఏకంగా అదానీ సంస్థతో రూ.12 వేల కోట్లకుపైగా ఒప్పందాలు చేసుకోవడం, రాష్ట్రంలోకి రెడ్‌కార్పెట్ వేసి ఆహ్వానించడం వంటి పరిణామాలు రాహుల్‌గాంధీని ఇబ్బందికి గురిచేసినట్టు చర్చ జరిగింది. జాతీయస్థాయిలో అదానీపై కాంగ్రెస్ యుద్ధం చేస్తుంటే, అదే పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పందాలు చేసుకోవడం ఢిల్లీ పెద్దలకు మింగుపడటం లేదట. వార్నింగ్ ఇచ్చినా లక్ష్యపెట్టకుండా రహస్యంగా ఆదానీకి సంబందించిన వారి పెండ్లికి వెళ్లినట్టు కూడా చర్చ జరిగింది.
కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడం అంటే మన చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకెళ్లి ప్రధాని మోదీ చేతిలో పెట్టడమేనని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. సీబీఐ, ఈడీలు బీజేపీ చేతిలో పావులుగా మారాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓవైపు పదే పదే విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాలు, ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ర్టాలు రాహుల్‌గాంధీ మాటపై సీబీఐని నిషేధించాయి. కానీ తెలంగాణలో మాత్రం ఉన్న నిషేధం ఎత్తివేసి సీబీఐకి గేట్లను బార్లా తెరిచారు. కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎన్నోసార్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారి సూచన, సలహా మేరకు సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం విచారణను సీబీఐ చేతుల్లో పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సీబీఐ స్పందించడం లేదని గుర్తుచేస్తున్నారు. తమవైపు తప్పు ఇంత స్పష్టంగా ఉండగా, బీఆర్ఎస్.. బీజేపీ మిలాఖత్ అయ్యాయని, అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారా? అని రాజకీయ విశ్లేషకులే అంటున్నారు.
కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రహదారులపై కవాతులు, కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుగా అనుమతి తప్పనిసరి చేసింది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో ఆర్ఎస్ఎస్పై ఆంక్షలను విధిస్తూ చట్టాలు అమల్లోకి తెస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి తన మూలాలను ఆర్ఎస్ఎస్లోనే వెతుక్కుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో 21 అధునాతన గోశాలల నిర్మాణం వంటివి ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంటున్నారు.
బీజేపీతో జతకట్టిన చంద్రబాబు రేవంత్‌రెడ్డికి ఆరాధ్యదైవంగా మారారని, రాహుల్‌కు కూడా ఆయన తర్వాతేనని సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు వ్యూహాలను తెలంగాణలో రేవంత్ అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రధాని, ఏపీ సీఎం ఆదేశాల మేరకు రేవంత్ నడుచుకోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందనే ఆరోపణలున్నాయి. రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, మోదీ తెరవెనుక ఒప్పందంతోనే గోదావరి నీళ్లు బనకచర్ల మీదుగా తరలించే కుట్రలు చేశారని ప్రచారం జరిగింది.