జూబ్లీహిల్స్, నవంబర్ 5: ముస్లింలపై రేవంత్‌రెడ్డి ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కపటనాటకం ఆడుతున్నాడని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి అనర్హుడైన అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వెనుక ప్రతిపక్షపార్టీగా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తొలి విజయానికి శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు. బుధవారం యూసుఫ్‌గూడ డివిజన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు ఓటువేసి గెలిపించాలని బ్యాలెట్‌తో అవగాహన కల్పించారు.
నాడు ఎన్నికల సందర్భంగా అప్రమత్తంగా ఓటు వేయాలని కేసీఆర్ చెప్పినప్పటికీ మోసపూరిత హామీలను నమ్మి పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు, ఇప్పుడు కేసీఆర్ పాలన రావాలని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. కాంగ్రెస్ 23 నెలల పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం ప్రజలు ఓటువేయరని అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారే తప్ప, ముస్లింలపై రేవంత్‌రెడ్డికి ఇప్పుడే కాదు.. ఎప్పుడూ ప్రేమలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, సీనియర్ నాయకులు అశీష్ కుమార్ యాదవ్, కూసం శ్రీనివాసులు, హరిసింగ్ నాయక్, గొల్ల నర్సింగ్‌రావు యాదవ్, షబ్బీర్, ఫయీం, కైసర్, చిన్న యాదవ్, గండ్లపల్లి శేషగిరిరావు, రోళ్ల రమేష్, వాసాల వెంకటేష్, కోట్ల వినోద్, పవన్‌రెడ్డి, మంజుల తదితరులు పాల్గొన్నారు.