AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో వారికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. కృష్ణమోహన్, ధనుంజయ, గోవిందప్పను ఈ నెల 26వ తేదీలోగా జడ్జి ఎదుట సరెండర్ కావాలని ఆదేశించింది. సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని నిందితులకు సూచించింది. ప్రస్తుత ఉత్తర్వులతో సంబంధం లేకుండా మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్లపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది.
ఇప్పటికే ఈ లిక్కర్ స్కాం కేసు విచారణను ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించింది. ఈ స్కాంలో దాదాపు రూ.3500 కోట్ల మేర కుంభంకోణం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే పలువురిని అదుపులోకి తీసుకుంది. పలువురి ఆస్తులను కూడా జప్తు చేసింది. తాజాగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు ఆదేశాలిచ్చింది. అలాగే కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మీ పేరిట ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు ఆదేశాలు జారీచేసింది.
మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బుతో స్థిర, చర ఆస్తులను చెవిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిందని సిట్ గుర్తించింది. రిజిస్ట్రేషన్ విలువను తక్కువగా చూపించి, పెద్ద మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్‌మనీగా మార్చినట్లు వెల్లడించింది. దాదాపు రూ.54.78 కోట్లను నల్లధనంగా మార్చినట్లు తేల్చింది.ఈ దర్యాప్తు నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం ఆస్తుల ఆటాచ్కు అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని సిట్ కోరింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆస్తుల ఆటాచ్ కోసం విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతినిచ్చింది. డీజీపీ తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఉత్తర్వులు జారీ చేశారు.
సిట్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది.