భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 19 : జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్కను అత్యంత పకడ్బందీగా, శాస్త్రీయంగా నిర్వహించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో దేశవ్యాప్తంగా ఐదేళ్లకొకసారి నిర్వహించే 7వ మైనర్ ఇరిగేషన్– రెండో వాటర్ బాడీస్ సెన్సస్ కార్యక్రమాన్ని జిల్లాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని చిన్న నీటి పారుదల వనరుల గణనను సమగ్ర ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా 2 వేల హెక్టార్ల లోపు విస్తీర్ణం గల జల వనరుల గణనను మొబైల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ముందుగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని నమూనా గణన పూర్తి చేసిన అనంతరం మిగతా గ్రామాల్లో గణన కొనసాగించాలని సూచించారు.
గ్రామ స్థాయిలో జీపీఓలు, ఏఈఓలు, టీఏలు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లను ఎన్యూమరేటర్లుగా పని చేస్తారని, మండల స్థాయిలో ఏఈ విద్యుత్ శాఖ, ఏఈ ఇరిగేషన్ శాఖ, పంచాయతీ సెక్రటరీలు, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు, వ్యవసాయ శాఖ ఎంఏఓలు, ఎంపీడీఓలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో చిన్న నీటి వనరుల గణన కోసం అవసరమైతే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లను కూడా ఎన్యూమరేటర్లుగా వినియోగించాలని ఆయన సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు, లిఫ్ట్ ఇరిగేషన్ నీటి నిల్వ ప్రాంతాలు, బోర్‌వెల్స్‌కు సంబంధించిన జల వనరులు సహా ప్రతీ నీటి వనరుకు సంబంధించిన సమగ్ర వివరాల సేకరణ అనివార్యమని ఆయన పేర్కొన్నారు.
గణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి ఎన్యూమరేటర్లకు జిల్లా, మండల స్థాయిలో తక్షణ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మొబైల్ యాప్ వినియోగం, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరణ వంటి అంశాల్లో స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల పరిధిలో చార్జి ఆఫీసర్స్ అయిన తాసీల్దార్లు, ఎంపీడీఓలు మండల స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించి అవసరమైన సమాచారాన్ని సేకరించి గణన పనులపై సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రతి నీటి వనరు భవిష్యత్ సాగునీటి ప్రణాళికలకు, నీటి సంరక్షణ చర్యలకు ముఖ్య ఆధారమని, అందువల్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి గణనను ఖచ్చితమైన సమాచారం, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, సిపిఓ సంజీవ రావు, భూగర్భ జలాల అభివృద్ధి శాఖ అధికారి రమేశ్, ఇరిగేషన్ ఈఈ అర్జున్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఎంపీఎస్‌ఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.