కట్టంగూర్, నవంబర్ 19 : కరీంనగర్లో ఈ నెల 25 నుండి 27 వరకు జరగనున్న మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఠారి మోహన్ పిలుపునిచ్చారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో మహా సభల పోస్టర్ ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే బడ్జెట్ లో మత్స్య వృత్తి రక్షణ, కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య వృత్తిపై ఆధారపడిన 10 లక్షల మంది కార్మికులకు ఉపాధి కరువైందన్నారు.
మత్స్యకారుల జీవిత భద్రతకు రూ.20 లక్షల ఇన్సూరెన్స్ ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. మహాసభల్లో మత్స్యకారుల భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్య ఫెడరేషన్ నల్లగొండ జిల్లా డైరెక్టర్ తల్లిడబోయిన అజయ్ కుమార్, సంఘం సభ్యులు నీలం రాములు, గుండు అంజయ్య, తవిడబోయిన వెంకటయ్య, నీలం శివ, పొన్నబోయిన రామకృష్ణ, నార్ల రవి, హనుమంతు, మహేశ్ పాల్గొన్నారు.