Pre Wedding Diet | ఒకరికి ఒకరై సాగుదామని ప్రమాణం చేసుకునే సందర్భం. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన వేడుక పెండ్లి. నాడు పెండ్లి చూపులు చూసి.. ఒకరినొకరు నచ్చితే.. తంతు ముగిసేది. కానీ నేడు అలా కాదు. కట్నకానుకలు తగ్గినా పర్లేదు.. విద్యార్హతలు సరితూగకున్నా నో ప్రాబ్లం.. కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు వధూవరులు. ఫిట్‌నెస్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మ్యారేజీలు కుదిర్చే నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో ప్రీ వెడ్డింగ్ డైట్ కల్చర్ పెరిగింది. పెండ్లి కుదిరిన ఆరు నెలల ముందు నుంచే పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు వ్యాయామం నుంచి పోషకాహారం వరకు ప్రతీది నిపుణుల సూచనలనే పాటిస్తున్నారు.
వివాహ గడియలు సమీపిస్తున్నాయంటే చాలు నగరంలో అమ్మాయిలు, అబ్బాయిలు జిమ్‌లకు పరుగులు తీయడం సహజంగా మారింది. అబ్బాయిలు మజిల్స్, చెస్ట్ పెరుగుదలపై దృష్టి సారిస్తే.. అమ్మాయిలు ఫిట్నెస్గా ఉండటమే కాకుండా నడుము చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించి నాజుకుగా తయారవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. త్రెడ్మిల్, సైక్లింగ్, వెయిల్ లిప్ట్, కార్డియో, జుంబా, స్పిన్ సైకిల్ తదితర వాటితో ప్రత్యేక వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అందంగా.. ఆరోగ్యంగా కనిపించడం కోసం పలు రకాల వ్యాయామాలపై దృష్టిపెడుతుంటారని జిమ్ నిర్వాహకులు తెలిపారు. అందుకోసం నచ్చిన ఫుడ్‌ను సైతం పక్కనపెడుతున్నారు. కేలరీలు కౌంట్ చేసుకుని మరీ కొలెస్ట్రాల్‌ను జిమ్‌లలో కరిగించుకుంటున్నారు.
ఫిట్నెస్ కోసం ఖర్చుకు వెనకాడటం లేదు. అందుకోసం నెలకు రూ. 2 వేల నుంచి 3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఏసీ వసతి ఉన్న జిమ్‌లలో రూ. 15 వందల నుంచి 3 వేల వరకు ఛార్జీ చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ తదితర ఖరీదైన ప్రాంతాల్లో ఫిట్నెస్ సెంటర్లకు క్రేజ్ ఉంటుంది. సెలబ్రీటీ స్టేటస్ ఉన్న జిమ్‌లో అయితే నెలకు రూ.50వేల పైమాటే. వ్యక్తిగత ఫిట్నెస్ సలహాదారులను నియమించుకుంటున్నారు. పోషకాహార నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. వారి ఫీజు 6 వేల నుంచి 80 వేల వరకు ఉంటుంది.
పెండ్లికి ముందు చక్కెర, ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండాలి. అధిక బరువు నుంచి తొందరగా బయటపడుతారు.
సరిపడా నీళ్లు తాగడం అత్యంత కీలకం. బయటకు వెళ్లాలంటే కచ్చితంగా వెంట వాటర్ బాటిల్‌ను పెట్టుకోవాలి. చర్మం సురక్షితంగా ఉండటానికి నీళ్లు కీలకపాత్ర వహిస్తాయి. పండ్లరసాలు తరుచూ తాగుతూ ఉండాలి.
రోజుకు కనీసం 7 గంటలైనా నిద్రపోవాలి. సమయపాలనలేని నిద్రతో చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
రోజులో తప్పకుండా ఒక్క పండైన తినాలి. ఉదయం పండ్లను అల్పహారంగా తీసుకుంటే గొప్ప ఫలితం ఉంటుంది.
వెజ్‌టేబుల్ వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేలా ఫుడ్ డైట్ ఉండాలి.
ఎప్పుడైనా బయటకు వెళితే పోషకాహార స్నాక్స్ బాదాం, కర్జూర, తదితర డ్రైఫ్రూట్స్ వెంటబెట్టుకెళ్లడం ఉత్తమం.
వధూవరులు ఫిట్నెస్ విషయంలో చాలా టెన్షన్ పడుతుంటారు. కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సమయానికి తినాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. సమయానికి నిద్రపోవాలి. కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. బరువు తగ్గే అవకాశం ఎక్కువ. ఉదయం పూట టీకి బదులు గోరువెచ్చని నీళ్లు తాగితే బరువు తగ్గుతారు. గుడ్లను డైట్లో తీసుకోవడం మంచిది.
– సనా ఫాతిమా, న్యూట్రిషనిస్ట్
మనసు ప్రశాంతత అన్నింటి కంటే ముఖ్యమైనది. యోగాలో సూర్యనమస్కారం వంటి ఆసనాలు చేయాలి. ప్రాణాయామం మంచి ప్రక్రియ. వాకింగ్, స్విమ్మింగ్ వంటివి అలవాటు చేసుకోవాలి. సాధారణంగా సగటు మనిషి 2వేల నుంచి 24వందల కేలరీలు తీసుకోవాలి. రోజుకు ప్రోటీన్ వంద గ్రాములు, ఫైబర్ 38 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. మరోముఖ్యమైన విష యం ఏంటంటే అధిక బీపీ, అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నవాటిని తినాలి.
– డాక్టర్ నవజన్
ప్రతి ఒక వ్యక్తి తప్పకుండా ఫిట్నెస్గా ఉండటం కోసం వ్యాయామం చేయాలి. దారుఢ్యం,ఆత్మవిశ్వాసం ఫిట్నెస్గా ఉన్నప్పుడే సాధ్యం. అందుకోసం సర్టిఫైడ్ ఉన్న జిమ్‌లో ట్రైనింగ్ తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి. మొదటగా క్లయింట్ మెడికల్ హిస్టరీ చూస్తాం. అందుకనుగుణంగా వారు కోరుకుంటున్న ఫలితాలు పొందేలా ప్లాన్ చేసి వ్యాయామం చేయిస్తాం. ఈ రోజుల్లో ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు.. ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది అవసరం.
– రౌనాక్ సిద్ధికి, వ్యాయామ నిపుణుడు
Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి”
Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?”
సర్ప్రైజ్ ఇస్తా రమ్మని చెప్పి.. కాబోయే భర్త గొంతు కోసేసింది
Crime news | ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు