Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనే నిమిత్తం అక్టోబర్ 23 నుంచి నవంబర్ 4 వరకు షరతులతో కూడిన అనుమతులను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. దీనికోసం రూ.50 వేల విలువ చేసే రెండు జమీన్లను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్ పర్యటన వివరాలను కోర్టు సమర్పించాలని సూచించింది. ఈ మేరకు సిట్ అధికారులు గతంలో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు రద్దు చేయాలని ఆదేశించింది. అలాగే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే పాస్‌పోర్టును సిట్ అధికారులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.