Liquor Shops | రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు శుక్రవారం ఒక్కరోజే భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటివరకు 25వేల దరఖాస్తులు రాగా.. శుక్రవారం ఒక్కరోజే 25వేల దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 50వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు శనివారమే చివరి రోజు కావడంతో.. రేపు 50 వేల దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మద్యం దుకాణాలకు ఈసారి అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. రియల్ ఎస్టేట్ పడిపోవడం, బిజినెస్ తగ్గిపోవడం లాంటి కారణాలు ఉన్నా కూడా వ్యాపారులు సిండికేట్లాగా ఏర్పడి పోటీ లేకుండా దరఖాస్తులు వేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది మద్యం దుకాణాల కోసం 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి దారుణంగా డిమాండ్ పడిపోయింది. ఈసారి లక్ష లోపే మద్యం దరఖాస్తులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మద్యం దరఖాస్తుల కోసం అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోండి అని గతంలో దరఖాస్తు చేసుకున్న వారి ఫోన్లకు ఎక్సైజ్ శాఖ అధికారులు SMSలు పెట్టి వేడుకుంటున్నారు. గతంతో పోలిస్తే దరఖాస్తులు ఈ సారి తక్కువగా వస్తుండంతో.. మద్యం టెండర్ల కోసం దరఖాస్తులు పెంచడానికి మెసేజీలు పెట్టి మరీ తిప్పలు పడుతున్నారు అధికారులు.