Free Bus | ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. ఫుట్‌బోర్డు మీద నిల్చోవద్దని చెప్పినందుకు ఇది ఫ్రీ బస్సు అంటూ డ్రైవర్‌తో గొడవకు దిగింది. అడ్డొచ్చిన కండక్టర్తోనూ వాగ్వాదానికి దిగింది. నా ఫొటో తీసుకో.. విజయవాడ పోలీసులకు చూపించు.. వాళ్లకు దడ పుడుతుందంటూ రెచ్చిపోయి మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రయాణికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోనకు చెందిన ఓ పల్లె వెలుగు బస్సు గురువారం ఉదయం విజయవాడ నుంచి పెనుగంచిప్రోలుకు బయల్దేరింది. అందులో ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ ఎక్కింది. అయితే ఆమె లోపలికి వెళ్లి కూర్చోకుండా.. ఫుట్‌బోర్డుపైనే నిల్చోంది. అది గమనించిన డ్రైవర్ ఆమెను హెచ్చరించాడు. ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని లోపలికి రమ్మని సూచించాడు. దీంతో డ్రైవర్‌తో ఆమె గొడవకు దిగింది. ఎందుకమ్మా డ్రైవర్‌తో గొడవ పడుతున్నావని కండక్టర్ మధ్యలోకి రాగా వాళ్లపైనా మండిపడింది.
ఇద్దరు కలిసి తనను మందలిస్తారా.. ఇది ఫ్రీ బస్సు.. నా ఫొటో తీసుకో.. ఈ ఫొటోను విజయవాడ సిటీలో లేదా చిల్లకల్లు, కంచికచర్ల పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చూపించుకో.. నా ఫొటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ కండక్టర్‌పై సదరు మహిళ దురుసుగా ప్రవర్తించింది. కండక్టర్ అయ్యప్ప మాల ధరించాడు.. అతనిపై దుర్భాషలాడకూడదు అని అన్నందుకు తోటి మహిళలను కూడా తిట్టింది. మహిళ వీరంగంతో చిర్రెత్తుకుపోయిన డ్రైవర్.. బస్సును పరిటాలలో ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. సదరు మహిళను ఎస్సై విశ్వనాథ్ మందలించారు. కండక్టర్, డ్రైవర్‌కు సర్దిజెప్పి పంపించేశారు. కాగా, బస్సులో మహిళ గొడవ పడుతున్న సమయంలో తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.