ఖైరతాబాద్, ఫిబ్రవరి 25 : ‘నా అన్వేషణ’ ఫేమ్, యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా హిందూ దేవతలపై అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు వీడియోలు చేశాడంటూ గత డిసెంబర్లో సినీ నటి కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 352, 79, 299 బీఎన్ఎస్, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
తాజాగా జనవరి 4న అన్వేష్‌పై అదనంగా సెక్షన్ 69 ఏ బీఎన్ఎస్ ద్వారా అతని యూట్యూబ్ చానల్‌ను బ్లాక్ చేయాలని, ఖాతాలను ఫ్రీజ్ చేసేందుకు సెక్షన్ 106 నమోదు చేయాలని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖపట్నంకు చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నట్టు గుర్తించారు. దీంతో బుధవారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తద్వారా స్వదేశానికి రాగానే అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టు తెలిసింది.