Phule Movie | సామాజిక విప్లవకారుల స్ఫూర్తిదాయక గాథ.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’!
Phule Movie | భారతదేశ సామాజిక సంస్కరణల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవిత పోరాటం ఇప్పుడు తెలుగు వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
Phule Movie | భారతదేశ సామాజిక సంస్కరణల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల జీవిత పోరాటం ఇప్పుడు తెలుగు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. కులవివక్ష, అంటరానితనం, లింగ అసమానతల వంటి సామాజిక రుగ్మతలపై అలుపెరగని యుద్ధం చేసి, అణగారిన వర్గాల అభ్యున్నతికి మరియు మహిళా విద్యకు బలమైన పునాదులు వేసిన ఆ ఆదర్శ దంపతుల త్యాగాలను ప్రతిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘ఫూలే’. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మహాత్మా జ్యోతిరావ్ ఫూలేగా ప్రతీక్ గాంధీ, సావిత్రిబాయి ఫూలేగా పత్రలేఖ తమ అద్భుత నటనతో ప్రాణం పోశారు. గతేడాది హిందీలో విడుదలై సుపర్హిట్ అందుకున్న ఈ చిత్రం తాజాగా తెలుగులో విడుదల కాబోతుంది. సుపదా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ పొన్నం రవిచంద్ర నిర్మాతగా ఈ చిత్రం తెలుగులో రూపుదిద్దుకుంది. చేతన్ కత్తి అందించిన హృదయాన్ని హత్తుకునే తెలుగు సంభాషణలతో కూడిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ నవంబర్ 27వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.
నవంబర్ 28, 2026న మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతిని పురస్కరించుకుని, ఆ మహనీయుడి ఆశయాలను, సమాజం కోసం ఆయన చేసిన నిస్వార్థ సేవలను నేటి తరానికి మరింత చేరువ చేయాలనే సదుద్దేశంతో ఒక రోజు ముందుగానే నవంబర్ 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కేవలం ఒక జీవిత చరిత్రలా కాకుండా, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప సామాజిక దస్తావేజుగా ఈ చిత్రాన్ని మలిచారు. ఫూలే దంపతులు తమ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలు, సామాజిక బహిష్కరణలు, అడ్డంకులను అధిగమించి జ్ఞాన జ్యోతిని ఎలా వెలిగించారో ఈ సినిమాలో అత్యంత భావోద్వేగభరితంగా చూపించారు. నేటి ఆధునిక సమాజంలో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, విద్యా హక్కుల వెనుక ఆనాటి తరం చేసిన పోరాటం ఎంత గొప్పదో ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించబోతుంది.
ఇక చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రజా గాయని, సామాజిక కార్యకర్త విమలక్క, టీఎఫ్‌సీసీ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రముఖ రచయిత పసునూరి రవీందర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రచయిత పసునూరి రవీందర్ మాట్లాడుతూ, హిందీలో ప్రశంసలు అందుకున్న ఈ గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న నిర్మాత పొన్నం రవిచంద్ర కృషి అభినందనీయమని, జ్యోతిరావ్ ఫూలే జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త విమలక్క మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారంటే అందుకు సావిత్రిబాయి ఫూలే వేసిన విద్యా పునాదులే కారణమని గుర్తుచేశారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారని, విడుదలైన అన్ని కేంద్రాల్లో ఈ చిత్రం హౌస్‌ఫుల్ వసూళ్లతో ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. టీఎఫ్‌సీసీ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, సమాజానికి దిశానిర్దేశం చేసే ఇటువంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలని, భవిష్యత్తులో జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా కూడా ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
నిర్మాత డాక్టర్ పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సునీల్ నారంగ్ గారికి, ఆడియో హక్కులను పొందిన మధుర ఆడియో సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది సాధారణ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా, వాస్తవ చరిత్ర ఆధారంగా రూపొందిన ఒక ప్రత్యేకమైన జానర్ సినిమా అని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 27న బాక్సాఫీస్ వద్ద ఎన్ని చిత్రాలు పోటీలో ఉన్నా, ‘ఫూలే’ తన బలమైన కథనంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు రెండు వందల ఏళ్ల నాటి చరిత్రను నేటి తరం, ముఖ్యంగా మహిళలు మరియు విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సినిమా ప్రచారంలో భాగంగా నవంబర్ 26న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని, ఈ వేడుకకు సినిమాలో మహాత్మా ఫూలే పాత్రలో నటించిన ప్రముఖ నటుడు ప్రతీక్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. చరిత్ర పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి ఆదరించాలని చిత్ర యూనిట్ పిలుపునిచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Phule Movie | సామాజిక విప్లవకారుల స్ఫూర్తిదాయక గాథ.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’!
Air Pollution | గాలి కాలుష్యం వల్ల కూడా గుండె జబ్బులు, మధుమేహం.. జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు..
Harish Rao | ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆదేశాలు వచ్చేలా చేసింది కేసీఆర్.. రేవంత్ మాటలపై హరీశ్ రావు ఫైర్
పుట్టపాక వాసి విజయ్‌కుమార్‌కు గణిత శాస్త్రంలో జేఎన్టీయూ డాక్టరేట్
Hey Kannamma | యశ్ మాస్టర్, ధనశ్రీ వర్మ జోడిగా ‘హే కన్నమ్మ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

