హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. 172 స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి సంబంధించి కొన్నేండ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడనున్నది. ఇందుకు సంబంధించిన కీలక ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్య బుధవారం జారీచేశారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పంపిన స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల మెరిట్ పూర్తి జాబితాను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్లు, డీపీవోలు తమ జిల్లాలకు చెందిన అభ్యర్థుల వివరాలు సేకరించి, నిబంధనల ప్రకారం తదుపరి నియామక ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గతంలో స్పోర్ట్స్ కోటా కింద నియమితులైన 98 మంది అభ్యర్థుల ఎంపికను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, ఖాళీగా ఉన్న పోస్టుల్లో కనీస అర్హత, స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా వారిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు 2శాతం స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 172 ఖాళీల భర్తీకి 2021 సెప్టెంబర్ 16న కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో 6,188 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2021 డిసెంబర్ 19న, జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించారు.
2025 నవంబర్ 1న ఫలితాలు ప్రకటించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, గతంలో తొలగించబడిన అభ్యర్థులకు డిసెంబర్ 29, 30 తేదీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఫిజికల్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు హాజరైన 184 మంది అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కమిటీ పరిశీలించి, జీవో-74 నిబంధనల మేరకు అర్హులైన, అనర్హులైన అభ్యర్థుల మెరిట్ కమ్ స్పోర్ట్స్ ప్రయారిటీ జాబితాను ఖరారు చేశారు.
స్పోర్ట్స్ అథారిటీ పంపిన ఈ మెరిట్ జాబితాలో జిల్లాలవారీగా వివరాలు విడిగా లేనందున, కమిషనర్ కార్యాలయం పూర్తి జాబితాను బుధవారం కలెక్టర్లకు పంపింది. సుదీర్ఘకాలం పెండింగ్ ఉన్న ఫైల్‌ను క్లియర్చేసినందుకు ఆ శాఖ మంత్రి సీతకకు తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు బుధవారం మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు.