సూర్యాపేట, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ.1,00 116లకు (లక్షా నూటపదాహార్లు) అదనంగా తులం బంగారం ఇస్తామని నమ్మ బలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకే ఎసరు పెడుతోందనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు మినహా ఓసీ, బీసీలకు ఈ పథకం అమలు కావడం లేదు. రెండు మూడు సార్లు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేసినప్పటికీ ఓసీ, బీసీలకు మాత్రం చెక్కులు రావడం రాలేదు. దీంతో సుమారు వెయ్యి మందికి పైగానే దరఖాస్తు చేసి చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారు.
మొత్తం జనాభాలో 25 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు నిధులు విడుదల చేస్తూ 75 శాతంగా ఉన్న బీసీ, ఓసీలకు నిధులు విడుదల చేయడం లేదు. పేద,మధ్య తరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి ఎంత భారమో గురి్ంతచిన మాజీ సీఎం కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట ఇచ్చిన అర్థిక సాయం లక్షలాది పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన తెలంగాణ ప్రాంతం ఆర్థికంగా చిన్నాభిన్నమైంది. నాటి పాలకుల పాపాల వల్ల తెలంగాణలో ఆడబిడ్డల పెండ్లిళ్లు చేయలేని స్థితిలోకి తల్లిదండ్రులు వచ్చారు.
రాష్ట్ర ఉద్యమ సమయంతో గల్లీగల్లీ తిరిగిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి రాగానే ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ.లక్షా నూటపదాహార్లు కేటాయిస్తూ ఓసీ, బీసీ, దళిత, గిరిజనులకు కల్యాణలక్ష్మి, మైనార్టీలకు షాదీ ముబారక్ పథకాలు తీసుకొచ్చారు. దీంతో లక్షలాది కుటుంబాల్లో సంతోషంగా వివాహాలు చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల కుట్రలు, మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతి పక్కన పెట్టడమే కాకుండా కేసీఆర్ పథకాలను కూడా కొనసాగించే పరిస్థితిలో లేదు. రైతుబంధు పేరిట కేసీఆర్ ఎకరా ఒక్కంటికి రూ.10వేలు ఇస్తే రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ రైతులను తీరని మోసం చేసింది.
ఎరువుల కోసం మళ్లీ క్యూలైన్ విధానాలు, మాయదారి యాప్లంటూ కొత్తగా తెచ్చి రైతులను కష్టాలకు గురి చేస్తోంది. కేసీఆర్ తెచ్చిన నీళ్లు బంద్ చేసి, పంటలు ఎండబెడుతోంది. హరితహారంతో కోట్లాది మొక్కలు నాటి అడవుల శాతం పెంచి ఊరూవాడ పచ్చదనం పెంచితే కనీసం పట్టించుకునే దిక్కులేక నేడు ఎండిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ వైఫల్యాలకు అంతేలేదు. ఇక ప్రధానమైన వాటిలో మరొకటి నాడు పేదింట వివాహం చేస్తే ఆ ఇంటి పెద్ద చేసే అప్పులకు వడ్డీలు పెరిగి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
దీంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట కేసీఆర్ ఇచ్చిన రూ.లక్షా నూటపదాహార్లనేఉ కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టబెట్టేస్తుందనే అనుమానాలు కనిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణే సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో గత ఏడాదిన్నరగా బీసీ, ఓసీలకు కల్యాణలక్ష్మి చెక్కులు రాలేదు. దీంతో అసలు తమకు ఈ స్కీం ఉన్నదా లేక తొలగించారా అనే సందేహాలను ఆయా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే నిధులు విడుదల చేసి పెండింగ్లో ఉన్న వారందరికీ చెక్కులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
18 నెలలైనా కల్యాణలక్ష్మి చెక్కు రాలే..
నా పెళ్లయి ఏడాదిన్నర దాటింది. కల్యాణలక్ష్మి కోసం ఆగస్టు 28, 2024న దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకూ చెక్కు రాలేదు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం వస్తుందని అధికారులు చెబుతున్నారు. మరి బీసీల సంగతేంటని అడిగితే మాకు తెలియదని చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెళ్లయిన మూడు నెలల లోపే కల్యాణలక్ష్మి చెక్కు అందించేవారు. రూ.లక్షకు తోడు తులం బంగారం ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారమేమో కానీ రూ.లక్ష కూడా ఇవ్వట్లేదు. నాలాంటి వారు ఎంతోమంది చెక్కుల కోసం ఎదురు చూస్తున్నారు.
-గుండగాని సాధన, గానుగుబండ