మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు(ACB Raid) అవినీతి అధికారుల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నాయి. శనివారం మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ (Rathod Bhiknayak) పట్టణంలోని తన నివాసం వద్ద రూ.2 లక్షల లంచం( Bribe) తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఏసీబీ ఆదిలాబాద్ ఏఎస్పీ మధు( ASP Madhu ) తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ సహకార జిల్లా ఇన్చార్జి అధికారిగా పని చేస్తున్న సమయంలో అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి గత సంవత్సరం నవంబర్లో సస్పెండ్ కు గురయ్యాడు. సదరు ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు, సస్పెండ్ ఎత్తి వేయడం విషయంలో రూ.7 లక్షలను లంచంగా డిమాండ్ చేశాడు.
మొదటి విడతగా రూ. 2 లక్షల ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి వారు చేయవలసిన పనులకు లంచం డిమాండ్ చేస్తే 1064 కు, 9154388963 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు.