ఎదులాపురం, అక్టోబర్ 24 : శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు చిరస్మరనీయమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్‌లోని స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి 5కే రన్ కార్యక్రమాన్ని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. కలెక్టరేట్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, వినాయక చౌక్, నేతాజీ చౌక్, అంబేదర్ చౌక్ గుండా కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 5కే రన్లో పాల్గొన్న వారిని అభినందించారు. సంఘ విద్రోహశక్తులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థ నిరంతరం పోరాడి అభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం మారుమూల ఆదివాసీ గ్రామాలను సైతం నిర్భయంగా ప్రజలు సందర్శించే అవకాశాలున్నాయని దానికి కారణం ఒకప్పుడు పోలీసులు చేసిన కృషి ఫలితమేనని కొనియాడారు. ఐదు కిలోమీటర్ల పరుగును ఎస్పీ పూర్తి చేసి సిబ్బంది, యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బీ సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, హసీబుల్లా, పట్టణ సీఐలు, ఎస్ఐలు, యువత, ముఖ్యంగా స్పోర్ట్స్ పాఠశాల విద్యార్థినులు పాల్గొని విజయంతం చేశారు.