Rain Alert | హైదరాబాద్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారనుంది. తీవ్ర వాయుగుండం ఎల్లుండి ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉంది. వాయవ్య దిశలో కదిలి ఈ నెల 28 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నెల 28న కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈదురుగాలులతో కూడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈజిల్లాల్లో 7 సెం.మీ. నుంచి 12 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లో కూడా కొద్దిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.