ఇల్లెందు, అక్టోబర్ 25 : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను ఆధ్వర్యంలో శనివారం ఇల్లెందు పట్టణంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సెంటర్ నుండి పాత బస్టాండ్, బుగ్గ వాగు మీదుగా కొత్త బస్టాండ్ వరకు డీఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక యువతతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల గురించి, దేశానికి వారు చేసిన త్యాగాల గురించి ప్రజలందరికీ తెలిసేలా ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తాటిపాముల సురేశ్, ఎస్ఐలు సూర్య, హసీనా, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.