ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త తలనొప్పిగా మారనున్నది. మంచిర్యాల జిల్లాలో 29 మంది, నిర్మల్ జిల్లాలో 17 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 32 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 12మంది డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికార పార్టీలో డీసీసీ పదవికి గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ పెరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు సైతం రంగ ప్రవేశం చేశారు. ఎవరికి వారు తమ వర్గానికి చెందిన నాయకుడికి అధ్యక్ష పదవి వచ్చేందుకు పట్టుబిగిస్తున్నారు. ఇటీవల అన్ని జిల్లాల్లో ఏఐసీసీ అబ్జర్వర్ల కమిటీలు పర్యటించాయి. మూడు రోజుల పాటు స్థానికంగా ఉండి పార్టీకి చెందిన ముఖ్య నాయకుల అభిప్రాయాలు సేకరించడంతో పాటు డీసీసీ రేసులో ఉన్న నాయకులను ప్రత్యక్షంగా కలిసి వారితో మాట్లాడారు. ఈ మేరకు కొన్ని పేర్లను ఫైనల్ చేసి సీల్డ్ కవర్లలో ఏఐసీసీకి అందజేయనున్నారు. దీంతో డీసీసీ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ‘హస్తం’లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
– మంచిర్యాల, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టనున్నది. దీంతో పార్టీ కోసం కష్టపడిన నాయకులు, అ సెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో పదవులు ఆశించి భంగపడిన నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఎవరికి వారు అధ్య క్ష పదవి తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నా రు. దీంతో స్థానిక రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే పీఎస్ఆర్ వర్గాల మధ్య డీసీసీ ఎంపిక కోసం పోటీ నెలకొంది. పీఎస్ఆర్ చెన్నూర్‌కు చెందిన తన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటున్న నాయకుడికి డీసీసీ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. మంత్రి వివేక్ మాత్రం క్యాతన్‌పల్లికి చెందిన తన అనుచరుడు లేదా మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ సీనియర్ నాయకుడికి డీసీసీ కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే పీఎస్ఆర్ సతీమణి సురేఖ ప్రస్తుత డీసీసీగా ఉన్న నేపథ్యంలో ఆయన వర్గానికి చెందిన నాయకుడికే పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది. పైగా ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడం, మంత్రి పదవి కూడా ఇవ్వనందున ఈసారైనా పీఎస్ఆర్ వర్గానికి ప్రియార్టీ దక్కాల్సిందే అంటూ ఆయన వర్గం నాయకులు పట్టుబడుతున్నారు. అసలు డీసీసీ సురేఖనే కొనసాగిస్తే బాగుంటుందని సైతం చెప్పుకుంటున్నారు. కానీ మంత్రి స్థాయిలో ఒత్తిడి మేరకు ఆయన వర్గానికి చెందిన నాయకులకే పదవి వచ్చే అవకాశాలున్నాయన్న ప్రచారం స్థానికంగా జరుగుతున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి డీసీసీ పదవి కోసం కాచుకొని కూర్చున్నారన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. కాగా ఆయనతో పాటు ఆదిలాబాద్ నుంచి పార్టీ సీనియర్ నాయకుడు కిసాన్ సెట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్‌రెడ్డి సైతం రేసులో ఉన్నారు. మాజీ ఎంపీ సోయం బాపురావుతో పాటు, ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నరేశ్ జాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. కాగా, పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతున్న వారికే అవకాశం ఇస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారు. దీంతో బోరంచ శ్రీకాంత్‌రెడ్డి లేదా నరేశ్జాదవ్లకే పదవి దక్కచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నాయకులు ఎవరికి వారు పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాణికి చెందిన అనిల్ గౌడ్, ఆసిఫాబాద్‌కు చెందిన బాలేశ్వర్‌గౌడ్, మసాదే చరన్, వసంత్ఖుమార్, రెబ్బెనకు చెందిన దుర్గం సోమయ్య, చెన్న సోమశేఖర్, జైనూర్ ఏఎంపీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రేసులో ఉన్నారు. కాగా, ప్రస్తుత డీసీసీ విశ్వప్రసాద్రావుకే మరోసారి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఇక్కడ వినిపిస్తున్నది. కొత్తగా చాన్స్ ఇవ్వాల్సి వస్తే ఆ పదవికి వారు ఏ మేరకు న్యాయం చేస్తారన్న ఆలోచన అధిష్టానం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామ్‌నాయక్‌కు డీసీసీ బాధ్యతలు అప్పగించాలని ఓ వర్గం కోరుకున్నప్పటికీ జిల్లా పార్టీలో ఐదేళ్లుగా ఉన్న వారికే అవకాశం ఇవ్వాలనే నిబంధనతో ఆయన్ని పక్కనే పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఖానాపూర్‌కు చెందిన దయానంద్, భైంసా పట్టణానికి ఆనందరావు పటేల్‌ల పేర్లు డీసీసీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముందు నుంచి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీహరిరావుకే డీసీసీ ఇవ్వాలనే డిమాండ్ స్థానికంగా వినిపిస్తున్నది. ఆయన నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో పార్టీలో సీనియర్లుగా ఉన్న వేరే నాయకులకు అవకాశం ఇవ్వాలన్న వాదన సైతం తెరపైకి వచ్చింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకే ఈ బాధ్యతలు సైతం అప్పగించాలని ఓ వర్గం కోరుకుంటుంది.
తీవ్రమై పోటీ నేపథ్యంలో డీసీసీ అధ్యక్ష పదవులు ఎవరిని వరిస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఓ వర్గానికి చెందిన నాయకుడికి ఇస్తే, మరో వర్గానికి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ మేరకు కాం గ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందన్నది ఆసక్తిగా మా రింది. పదవి ఆశించి భంగపడిన నేతలను బుజ్జగిం చడంపై పార్టీ దృష్టిసారించనున్నట్లు సమాచారం. పదవి ఎవరికి వచ్చినా అంతా కలిసి పని చేసేలా సయోధ్య కుదర్చాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రులు, మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. డీసీసీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న నాయకులు పైరవీలు సైతం గట్టిగానే చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది.
సన్నిహిత ఎమ్మెల్యేలు, మంత్రులను కలుసుకొని డీసీసీ పదవి దక్కించుకునే పనుల్లో ఆశావాహులు ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఏఐసీసీ డీసీసీ అధ్యక్షుల నియామకం చేయనున్నది. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి అబ్జర్వర్ల కమిటీలో సీల్డ్ కవర్లలో జిల్లాకు నాలుగు నుంచి ఆరు పేర్లను అదిష్టానానికి ప్రతిపాదించనున్నాయి. తుది నిర్ణయం అధిష్టానం తీసుకోనున్నది. ఈ నెలాఖరుగా డీసీసీపై ప్రకటనలు వచ్చే అవకాశాలుండడంతో ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వర్గపోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో డీసీసీ పదవులు పార్టీలో కొత్త గొడవలు తీసుకువస్తాయా… వర్గపోరుకు మరింత ఆజ్యం పోస్తాయా… లేకపోతే అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటాయా అన్నది ఆసక్తిగా మారింది.