Rana | టాలీవుడ్ ప్రముఖుల నుండి ఈ మధ్య శుభవార్తలు అందుతున్నాయి. మెగా ఫ్యామిలీలో ఉపాసన సీమంతం వేడుకలు, వరుణ్ తేజ్ తండ్రిగా ప్రమోషన్, నారా రోహిత్ వివాహం, రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఇలా సెలబ్రిటీల ఇళ్లలో సంతోష వాతావరణం నెలకొంది. ఇప్పుడు హ్యాపీ మూడ్‌లోకి మరో స్టార్ ఫ్యామిలీ కూడా చేరింది. అదే దగ్గుబాటి కుటుంబం.ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి మరియు ఆయన సతీమణి మిహిక బజాజ్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ హ్యాపీ న్యూస్‌తో దగ్గుబాటి ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది.
ముఖ్యంగా, నిర్మాత సురేష్ బాబు మరోసారి తాతయ్య కాబోతున్న ఆనందంలో మునిగిపోయారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులంతా రానా–మిహికల జీవితంలో రాబోతున్న ఈ కొత్త అధ్యాయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రానా దగ్గుబాటి వివాహం 2020లో మిహిక బజాజ్‌తో జరిగింది. వివాహం తర్వాత వీరు ఎక్కువ సమయం ముంబైలో గడుపుతూ, వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచారు. ఇప్పుడు, ఈ బిడ్డ రాకతో దగ్గుబాటి ఫ్యామిలీ కొత్త శకానికి శ్రీకారం చుట్టనుంది. దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తున్న దగ్గుబాటి కుటుంబంలో, సురేష్ బాబు తనయుడిగా రానా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటేష్ కుమారుడు ఇంకా చిన్నవాడు కావడంతో, దగ్గుబాటి తదుపరి తరం రానా దంపతుల బిడ్డతో ప్రారంభం కాబోతోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రానా దగ్గుబాటి కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా పలు రంగాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం కొత్త తరహా కథలపై చర్చలు జరుపుతున్నారు. దుల్కర్ సల్మాన్ నటించిన కాంత సినిమాకు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితంలో ఈ కొత్త బాధ్యత కోసం రానా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద, దగ్గుబాటి ఫ్యామిలీలోకి రాబోతున్న ఈ చిన్నారి కొత్త ఆనందాన్ని తీసుకురానుంది. ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు “దగ్గుబాటి జూనియర్” రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!