భీమారం, సెప్టెంబర్ 22 : మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేతలకు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సోమవారం మంత్రి వివేక్‌తో పాటు కలెక్టర్ కుమార్ దీపక్ పీహెచ్సీ ప్రారంభించిన అనంతరం హాస్పిటల్ లోపల కలియదిరుగుతున్నారు. అదే సమయంలో భీమారం కాంగ్రెస్ కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లను పోలీసులు లోపలికి రాకుండా అడ్డుకున్నారు.
జైపూర్ మండల అధ్యక్షుడు మహ్మద్ ఫాయజొద్దీన్, నాయకుడు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి రాగా, వారిని సైతం అడ్డుకోవడంతో ఘర్షణ వాతవరణం నెలకొంది. కార్యకర్తలను అడ్డుకోవడానికి మీరెవరని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇందుకు స్పందించిన మంత్రి వివేక్ పోలీసులపై సీరియస్ అయ్యారు. ఏసీపీ వెంకటేశ్వర్లతో పాటు కోటపల్లి సీఐ బన్సీలాల్‌పై అసహనం వ్యక్తం చేశారు.
ఐకేపీ మహిళలను బతుకమ్మ చీరల పేరిట భీమారం తరలించగా, వేచి చూసి మంత్రి రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. చీరలు ఇస్తామని ఐకేపీ సీసీలు, సీఏలు ఆధార్ కార్డులతో రామ్మన్నారని.. ఇక్కడ చూస్తే ఏమీ లేదంటూ మహిళలు అసహనంతో వెళ్లిపోయారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్ రెడ్డి, నేతలు సత్యనాయరాయణ రెడ్డి, రవి, శ్రీనివాస్, శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రాజ్‌కుమార్ నాయక్, మాజీ సర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు.