లండన్ : విదేశీ ప్రతిభావంతులకు ఇచ్చే హెచ్-1బీ వీసా ఫీజును అనూహ్యంగా లక్ష డాలర్లకు పెంచి ప్రతిభావంతులైన ఉద్యోగుల రాకకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ వేసిన వేళ.. అలాంటి ప్రతిభావంతులను ఒడిసిపట్టడానికి ఇతర దేశాలు సన్నద్ధమవుతున్నాయి. నిపుణులను తమ దేశానికి ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అమెరికా హెచ్1బీ తరహాలో చైనా కే వీసాను ప్రకటించింది. బ్రిటన్ కూడా ప్రతిభావంతులకు వీసా ఫీజును రద్దు చేయాలని నిర్ణయించింది. మరో భారత్ కూడా నిపుణులైన ప్రవాసీయులను తిరిగి స్వదేశానికి ఆహ్వానిస్తున్నది.
తన ఇమిగ్రేషన్ రూల్స్‌లో చైనా స్టేట్ కౌన్సిల్ భారీ మార్పులు చేసి కొత్తగా కే-వీసాను ప్రకటించింది. సైన్స్, టెక్నాలజీ, ఇతర స్టెమ్ రంగాల్లోని యువ విదేశీ ప్రతిభావంతులను ఆకర్షించడమే లక్ష్యంగా దీనిని ప్రకటించింది. ఈ కే-వీసాను చాలా సులభంగా పొందవచ్చునని తెలిపింది. దీనికి స్థానిక కంపెనీల స్పాన్సర్ షిప్ అవసరం ఉండదు.
మొన్నటి వరకు వలస ఉద్యోగులను ఎలా పంపాలా అని కిందామీద పడిన యూకే ప్రభుత్వం హఠాత్తుగా యూటర్న్ తీసుకుంది. నిపుణులను అందిపుచ్చుకోవడానికి బ్రిటన్ ముందడుగు వేస్తున్నది. విదేశీ నిపుణుల కోసం కొన్ని వీసా ఫీజులను రద్దు చేయాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ యోచిస్తున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా కథనాన్ని ప్రచురించింది. దేశ ఆర్థిక స్థాయిని పెంచే సైంటిస్టులు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణులను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే స్టార్మర్ ఆధ్వర్యంలో ‘గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్’ చురుకుగా పనిచేస్తున్నదని తెలిపింది. ప్రపంచంలోని టాప్ 5 యూనివర్సిటీల్లో చదివిన వారిని, వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మక బహుమతులను గెల్చుకున్న వారికి వీసా ఫీజును సున్నాకు తగ్గించాలని వీరు యోచిస్తున్నారు.
దేశ ఆర్థిక వృద్ధిని పెంచే ప్రయత్నంలో ప్రపంచంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణులను ఆకర్షించే ఆలోచనలపై పనిచేస్తోందని, నెంబర్ 10 డౌన్‌టౌన్ స్ట్రీట్‌లో, ట్రెజరీ లోపల జరిగిన చర్చలపై వివరించిన వ్యక్తులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. ‘విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి రావాలి’ విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి రావాలంటూ పీఎంవో కార్యాలయం ముఖ్య అధికారి డాక్టర్ పీకే మిశ్రా పిలుపునిచ్చారు. ‘కెపాసిటీ బిల్డింగ్ కమిషన్’లో భాగంగా ప్రతిభావంతులైన ప్రవాస భారతీయులను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.
ట్రంప్ ప్రభుత్వం తాజాగా పెంచిన హెచ్-1బీ వీసా ఫీజు నుంచి డాక్టర్లకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వైట్ హౌస్ సోమవారం వెల్లడించింది. గ్రామీణ అమెరికాలో ఇప్పటికే ఉన్న డాక్టర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ వైద్య సంస్థలు వ్యక్తం చేసిన ఆందోళనను పురస్కరించుకుని ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజెర్స్ బ్లూమ్‌బర్గ్ న్యూస్‌కి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవకులకు తీవ్ర కొరత ఉన్న కారణంగా దవాఖానలకు డాక్టర్ల నియామకాల కోసం హెచ్-1బీ ప్రోగ్రామ్ అత్యంత కీలకంగా మారింది. పెద్ద దవాఖానలు డాక్టర్లను, హెచ్-1బీ ప్రోగ్రామ్ ద్వారా స్పాన్సర్ చేస్తుంటాయి. తమ వైద్య శ్రామిక శక్తిలో అంతర్జాతీయ మెడికల్ గ్రాడ్యుయేట్లు కీలక భాగస్వాములని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబీ తెలిపారు. డాక్టర్ల కొరత ఉన్నట్లు గుర్తించిన ప్రదేశాలలో 7.6 కోట్ల మందికి పైగా అమెరికన్ పౌరులు నివసిస్తున్నట్లు సమాచారం.