కాంగ్రెస్ పార్టీ.. నమ్మి ఓటేసిన పేద రైతుల భూములను గుంజుకుంటూ నోటికాడి బుక్కను ఎత్తగొడుతున్నది. అధికార నేతల కోసం బక్క రైతులను అరిగోస పెడుతున్నది. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చవద్దని ఎన్నిసార్లు కోరినా పెడచెవిన పెడుతున్నది. ఎకరాకు రూ.26 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి రూ.6 లక్షలకు కుదించింది.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తేతెలంగాణ): ట్రిపుల్ ఆర్ బాధితుల కష్టాలు..కన్నీళ్లు తమకు తెలుసుననీ, వారికి బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీలో సర్కారును నిలదీస్తామని, అవసరమైతే న్యాయపోటం చేస్తామని, ప్రజాక్షేత్రంలోనూ బరిగీసి కొట్లాడుతామని స్పష్టంచేశారు. బాధితులు చెల్లాచెదురు కావద్దని, మోసం చేసిన సర్కారును గల్లాపట్టి అడగాలని హితబోధ చేశారు. ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే సర్కారు దిగొస్తుందని తేల్చిచెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్పుతో నష్టపోయిన సూర్యాపేట, నల్లగొండ, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన సుమారు 400 మంది బాధితులు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు.
కాంగ్రెస్ సర్కారు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడంతో తమకు జీవనాధారమైన భూములను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ట్రిపుల్ ఆర్ కోసం రైతుల భూములు గుంజుకోబోమని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీతో హామీ ఇప్పించారని గుర్తుచేశారు. ఓట్లు డబ్బాలో పడగానే రేవంత్ సర్కారు అరాచకానికి తెరలేపిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రూపొందించిన అలైన్‌మెంట్‌ను మార్చి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నామమాత్రపు పరిహారమిచ్చి విలువైన భూములు గుంజుకొనేందుకు యత్నిస్తున్నదని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ సర్కారు నమ్మి ఓటేసిన పేద రైతుల భూములను గుంజుకుంటూ నోటికాడి బుక్కను ఎత్తగొడుతున్నది. అధికార నేతల కోసం బక్క రైతులను అరిగోస పెడుతున్నది. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చవద్దని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నది. ఎకరాకు రూ.26 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి రూ.6 లక్షలకు కుదించింది.
-కేటీఆర్
ప్రాజెక్టులు, వివిధ అభివృద్ధి పనులకు ఏ ప్రభుత్వమైనా భూ సేకరణ చేయాల్సి ఉంటది. కేసీఆర్ పాలనలో మల్లన్నసాగర్‌తో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణ సందర్భాల్లో రైతులను ఒప్పించి, మెప్పించి, మెరుగైన పరిహారమిచ్చి, పునరావాసం కల్పించి భూములు సేకరించినం. మంత్రులు, ప్రజాప్రతినిధులు రాత్రింబవళ్లు చర్చించి రైతులకు నచ్చజెప్పి ముందుకెళ్లిండ్రు. ఏనాడూ దౌర్జన్యం చేయలే..
-కేటీఆర్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్‌తో పాటు అనేక ప్రాజెక్టుల కోసం రైతులను ఒప్పించి, మెప్పించి, మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించి భూములు సేకరించామని కేటీఆర్ గుర్తుచేశారు.ఎంతో శ్రమకోర్చి నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం వల్లే రైతుల భూముల విలువ పెరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత అన్నివర్గాల తరహాలోనే రైతులను కూడా అతలాకుతలం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ‘ఒడ్డెక్కేదాకాఓడ మల్లన్న.. ఒడ్డెక్కినంక బోడమల్లన్న’ అన్న చందంగా నమ్మి ఓటేసిన పేద రైతుల భూములను గుంజుకుంటున్నదని మండిపడ్డారు. ఎకరాకు రూ. 26 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.6 లక్షలకు కుదించిందని, ఓటేసిన పాపానికి పచ్చని విలువైన భూములను లాక్కొని రైతుల బతుకులను ఛిద్రం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ట్రిపుల్ ఆర్ బాధిత గ్రామాల రైతులంతా ఏకమై వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామ చావిడి వద్దకు అన్ని పార్టీల నాయకులను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. తద్వారా ఈ విషయం కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్తుందని చెప్పారు. బాధిత రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ట్రిపుల్ ఆర్ బాధితుల సమస్యలను రాజ్యసభలో తమ నలుగురు బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తుతారని కేటీఆర్ హామీ ఇచ్చారు. సర్కారు అసెంబ్లీ నిర్వహిస్తే తాము సైతం బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ నేతల మాయమాటలను నమ్మితే నిండా మునిగేది బాధితులేనని హెచ్చరించారు. శాస్త్రబద్ధమైన అలైన్మెంట్ రూపొందించేదాకా రైతుల తరఫున పోరాడతామని స్పష్టంచేశారు. ‘తెలంగాణ భవన్ జనతా గ్యారేజీలా మారింది..బాధితులు ఎప్పుడైనా రావొ చ్చు..మా లీగల్ టీంను సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చు’ అని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బొల్లం మల్లయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బీఆర్ఎస్ నాయకులు సుర్వి యాదయ్య గౌడ్, శుభప్రద్ పటేల్, అబ్రెట్ రాములు, లీగల్ సెల్ మెంబర్ లిలిత పాల్గొన్నారు.