ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని సింగరేణి కార్మికుల విషయంలోమరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు ఆయన తీపి కబురుకు బదులు చేదు కబురు చెప్పారు. గతేడాది వలె ఈ ఏడాది కూడా బోగస్ బోనస్‌తో కార్మికుల పొట్ట కొట్టారు. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలపై కార్మికులకు వాటా చెల్లించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా సంస్థ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులను పక్కన పెట్టి నామమాత్రపు లాభాలను చూపించి కార్మికులను మోసం చేసింది.
గత ఆర్థిక సంవత్సరం సింగరేణి కార్మికుల కష్టంతో రూ.6,394 కోట్లు లాభాలు సాధిస్తే అందులో రూ.4,034 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టడం కార్మికులను మోసం చేయడమే. రూ.2,360 కోట్లు లాభాలుగా పేర్కొంటూ అందులో 34 శాతం వాటా ఇస్తున్నట్టు పేర్కొనడం కార్మికులను దగా చేయడమే.
2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ రూ.4,701 కోట్లు లాభాలు ఆర్జిస్తే అందులో సంస్థ అభివృద్ధి కోసమని రూ.2,289 కోట్లు పక్కనపెట్టి రూ.2,412 కోట్లు మాత్రమే లాభాలపై 33 శాతం వాటాగా చెల్లించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నకాలంలో ఏనాడూ ‘సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం’ అని ఎలాంటి నిధులను పక్కన పెట్టలేదు. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలపై మాత్రమే వాటాను చెల్లించింది. ఈ మోసంపై కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకీ సంస్థ అభివృద్ధి కోసం గత ఏడాది పక్కన పెట్టిన రూ. 2,289 కోట్లతో సంస్థ అభివృద్ధికి ఏం చేశారో కార్మికులకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, గత రెండేండ్లలో సంస్థ అభివృద్ధి కోసం పక్కనపెట్టిన మొత్తం రూ.6,323 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా 51 మంది రాజకీయ నాయకుల మధ్య కార్మికులకు ఏటా ఆనవాయితీగా చెల్లించే లాభాల బోనస్ ప్రకటన చేయడం చూస్తుంటే సింగరేణిలో కాంగ్రెస్ రాజకీయ నాయకుల జోక్యం ఎంతమేర ఉన్నదో అర్థమవుతున్నది. దాదాపుగా రెండేండ్ల తర్వాత తొలిసారి సింగరేణి కార్మికులపై ప్రెస్‌మీట్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ కార్మికుల సొంత ఇంటి కల, 9 నెలలుగా ఆగిపోయిన మెడికల్ బోర్డు, ఇన్‌కంట్యాక్స్ మినహాయింపులు, మారుపేర్ల సమస్య, మెడికల్ బోర్డులో పారదర్శకత, ఉద్యోగాల నుంచి తొలగించబడిన కార్మికులను తిరిగి చేర్చుకోవడం, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, తాజా బదిలీ విధానం రద్దు, పదోన్నతులు, కేడర్ స్కీంలు, గని ప్రమాద బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, జూనియర్ ఆపరేటర్ల ప్రమోషన్ల వంటి అనేక సమస్యల్లో ఒక్కదానిపైనా మాట్లాడకపోవడం ఆయనకు సింగరేణి కార్మికుల సమస్యలపై ఉన్న అవగాహనారాహిత్యాన్ని తెలియజేస్తున్నది.
నేల తల్లి గర్భంలో ప్రకృతికి విరుద్ధంగా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న అండర్‌గ్రౌండ్ కార్మికుల అలవెన్స్ 12 శాతం మీద సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తే అందులో పదివేలకు మాత్రమే ఇన్‌కమ్‌టాక్స్ మినహాయింపు ఇవ్వడం అత్యంత బాధాకరం. సింగరేణి క్వార్టర్ కలిగిన కార్మికుడి జీతం పైన పెర్క్ టాక్స్‌ను కోల్ ఇండియాలో అమలుచేస్తున్న విధంగా సింగరేణిలో కూడా యాజమాన్యమే చెల్లించాలని కార్మికులు ఏండ్లుగా కోరుతున్నా కేంద్రం పెడచెవిన పెట్టింది.
సింగరేణిని ప్రైవేటీకరిస్తే వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు అమ్మకాల్లో పోటీ పెరుగుతుంది. ప్రైవేట్ మాఫియా కార్మికులను శ్రమ దోపిడి చేస్తారు. కార్మికుల రక్షణకు, పర్యావరణానికి ప్రైవేట్ మాఫియా ప్రాధాన్యం ఇవ్వవు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించరు. కొత్త గనులు రావు. వారసత్వపు ఉద్యోగాలుండవు. గనులు మూతపడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. కార్మికులకు న్యాయంగా అందవలసిన హక్కులు, బోనస్‌లు, అలవెన్స్‌లకు గండి కొడతారు. దేశ సంపద ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే వారు మాత్రమే అభివృద్ధి చెందుతారు. దీనివల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. కొద్ది రోజుల్లోనే సింగరేణి సంస్థ కనుమరుగవుతుంది.
సింగరేణి కేసీఆర్ మానస పుత్రిక. నాడు నేడు ఏనాడైనా సింగరేణి సంస్థను కాపాడాలన్న, కార్మికులను కడుపున పెట్టుకుని చూసుకోవాలంటే ఒక్క కేసీఆర్‌తో మాత్రమే సాధ్యం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం సింగరేణికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించింది. అందులో ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం, 26 వారాల మెటర్నటీ లీవ్, అన్ని మతాల పండుగలకు పెయిడ్ హాలీడే, ఐఐటీ, ఐఐఎంలలో సీటు సంపాదించిన కార్మికుల పిల్లలకు ఫీజు రీ యింబర్స్‌మెంట్, ఇల్లు కట్టుకునే వారికి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం, జీవో 76 ద్వారా సింగరేణి ఏరియాలో నివసించేవారికి పట్టాల పంపిణీ.
ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచితంగా ఎలక్ట్రిసిటీ.. సింగరేణి క్వార్టర్లు, డ్యూటీలో చనిపోయిన కార్మికుడికి 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, రిటైర్మెంట్ వయస్సు 61కి పెంపు సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ సీట్లలో 5 శాతం కోటా, రామగుండం మెడికల్ కాలేజీలో 7 సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకే కేటాయించడం, సిమ్స్ అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న దవాఖానలో 50 పడకలు సింగరేణి కార్మికులకు రిజర్వ్. ఇలా అనేక కార్మిక సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది.
దాదాపుగా రెండేండ్ల కాలంలోనే పాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇప్పుడు కార్మికులకు లాభాల వాటాలో 60శాతానికి పైగా కోత విధిస్తూ తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతాం. కార్మికుల పక్షాన పోరాడుతాం.
– (వ్యాసకర్త: మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు) కొప్పుల ఈశ్వర్